అయోధ్య రామ మందిరం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమంలా సేకరించిన విరాళాల్లో కొన్ని ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. అత్యంత భక్తి భావంతో కొంత మంది సమర్పించిన చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఖాతాల్లో డబ్బుల్లేకుండా చెక్కులిచ్చారు. వాటిని ట్రస్ట్ బ్యాంకుల్లో వేస్తే అవి బౌన్స్ అయ్యాయి. ఇలాంటివి వందల్లో ఉంటే… అనుకోవచ్చు.. కానీ అవి పదిహేను వేలు దాటిపోయాయి. ఈ చెక్కుల్లో మొత్తంగా రూ. ముఫ్పై కోట్ల విలువైన అంకెలు వేసినట్లుగా చెబుతున్నారు. అయితే బ్యాంకులు ఈ చెక్కులన్నింటినీ మరోసారి పరిశీలిస్తున్నాయి.
చెక్కులు ఇష్యూ చేసిన వారికి ఫోన్ చేసి.. మరో చెక్కు పంపమని కోరుతున్నాయి. ఎలాగైనా ఈ వివరాళాలను ట్రస్ట్ ఖాతాలో జమ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. కొంత మంది స్పందిస్తున్నారు.. కానీ ఎక్కువ మంది స్పందించడం లేదని తెలుస్తోంది. అయోధ్య రాముని విరాళాల సేకరణ మొదటి నుంచి వివాదాస్పదం అయింది. బీజేపీ నేతలు ఇంటింటికి వెళ్లి దౌర్జన్యంగా విరాళాలు సేకరించారన్న విమర్శలు వచ్చాయి. రాజకీయంగా దుమారం కూడా రేగింది. కొంత మంది అయోధ్య ట్రస్ట్ పేరుతో కాకుండా సొంత పేర్లతో విరాళాలు సేకరించారు. వాటిపైనా దుమారం రేగింది.
చివరికి ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించడం నిలిపివేశారు. మొత్తంగా రూ. ఐదు వేల కోట్ల వరకూ విరాళాలు వచ్చాయని సమాచారం. పూర్తి వివరాలు ఇంకా ట్రస్ట్ బయట పెట్టలేదు. బీజేపీతో సన్నిహితంగా ఉండే కార్పొరేట్ కంపెనీలన్నీ పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించాయి. బీజేపీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి మొహమాట పెట్టో.. బలవంతంగానో తీసుకున్న చెక్కులు బౌన్స్ అయ్యాయని …నిజంగా రాముడికి భక్తితో ఇచ్చిన విరాళాలు బౌన్స్ కావని కొంద మంది అంటున్నారు.