లాన్ డౌన్ తరవాత.. దేశ వ్యాప్తంగా సినిమాలు విడుదలయ్యాయి. అన్ని భాషల్లోనూ.. మళ్లీ కొత్త సినిమాలొచ్చాయి. కానీ.. టాలీవుడ్ లో ఉన్న సక్సెస్ రేటు ఎక్కడా లేదు. ఈ నాలుగు నెలల్లో తెలుగులో నాలుగైదు హిట్ సినిమాలు పడ్డాయి. బాలీవుడ్ లో అయితే ఒక్కటీ లేదు. ఈ విషయంలో బాలీవుడ్ కంటే మనమే బెటర్. దిల్ రాజు కూడా ఈ మాటే చెబుతున్నారు. ”కరోనా తో చిత్రసీమ కుదేలైపోయింది. మళ్లీ తేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. మనం మాత్రం ఓ అడుగు ముందే ఉన్నాం. ధైర్యంగా సినిమాలు విడుదల చేస్తున్నాం. బాలీవుడ్ లో అదీ లేదు. వాళ్లు సినిమా విడుదల చేయడానికే భయపడుతున్నారు. ఆడియన్స్ కూడా రావడం లేదు. ఇక్కడ అలా లేదు. పరిస్థితి మెరుగ్గా ఉంది. నిర్మాతలే కాదు, ప్రేక్షకులూ ధైర్యం చేస్తున్నారు. అందుకే ఇక్కడ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి” అన్నారు.
త్వరలోనే 50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన తెలుగు రాష్ట్రాల్లో వస్తుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై కూడా స్పందించారు. ”ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అన్ని చర్యలూ తీసుకోవడం ప్రభుత్వాల బాధ్యత. 50 శాతం నిబంధన పెట్టినా పెట్టొచ్చు. కానీ 50 శాతం ఆక్యుపెన్సీ ఉన్నా, సినిమాల్ని విడుదల చేయడమే ఉత్తమం. సినిమాలు తయారు చేసుకుని, విడుదల కాకుండా ఆపేయడం మంచిది కాదు. కార్మికులపై అది తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి.. 50 శాతం నిబంధన ఉన్నా.. తెలుగులో సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధంగానే ఉన్నార”ని దిల్ రాజు చెప్పారు.