జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్‌కు బెయిల్ లభించింది. నాలుగు కేసుల్లో ఆయనకు శిక్ష పడింది. ఆ నాలుగు కేసుల్లోనూ బెయిల్ లభించింది. లాలూ ప్రసాద్ యాదవ్‌కు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడ్డు పరిస్థితి ఎదురైంది. ఆయనపై ఉన్న కేసులు చురుగ్గా కదిలాయి.. శిక్ష కూడా పడింది. ఒక దానితర్వాత ఒకటి నాలుగు కేసుల్లో శిక్షపడటంతో ఆయన జైలుకే పరిమితమయ్యారు. అదే సమయంలో ఆయనకు తీవ్ర అనారోగ్యం కూడా వెంటాడుతోంది. చాలా కాలం పాటు జార్ఖండ్ జైల్లో ఉన్న ఆయన ఇప్పుడు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. బెయిల్ లభించినా… ఆయనకు ఆరోగ్యం మెరుగయితేనే.. బీహార్‌లో అడుగు పెడతారు.
బీహార్ రాజకీయాల్లో లాలూ ప్రసాద్‌ది చెరుగని ముద్ర. గతంలో ఆయనకు శిక్ష పడినప్పటికీ.. బెయిల్ లభించడంతో… 2015 అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పారు. జేడీయూతో పొత్తు పెట్టుకుని అధికార పార్టీగా మారారు. జేడీయూ కన్నా ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్‌కే ఇచ్చారు. తర్వాత ఇతర కేసుల్లోనూ శిక్ష పడటంతో ఆయన జైలు పాలయ్యారు. ఆ తరవాత ఆయన ఇద్దరు కుమారుల్ని డంప్ చేసేసిన నితీష్ కుమార్ బీజేపీతో జట్టు కట్టారు. 2020లో జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీష్ కుమార్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. దీంతో బీహార్‌లో ఇప్పుడు అనిశ్చిత రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి.
ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్‌లోకి ఎంట్రీ ఇస్తే పరిస్థితులు మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన మార్క్ రాజకీయాలు చేస్తే నితీష్ కుమార్ ప్రభుత్వం దిన దిన గండంగా గడపాల్సి ఉంటుంది. ఇప్పటికే లాలూ కుమారుడు తేజస్వి.. నితీష్ కుమార్‌కు చుక్కలు చూపిస్తున్నారు. సౌమ్యంగా ఉండే నితీష్ కంట్రోల్ కోల్పోతున్నారు. అసెంబ్లీలోని మార్షల్స్‌తో విపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారు. లాలూకు ఆరోగ్యం కాస్త కుదుటపడితే.. నితీష్‌కు టెన్షన్ తప్పకపోవచ్చు.