కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇక బెంగాల్ లో జరిగే బహిరంగసభలకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం కరోనా విజృంభణే. దేశంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ సమయంలో రాజకీయ ర్యాలీలు నిర్వహించడంపై విమర్శుల వెల్లువెత్తుతున్నాయి. అలాంటివి కరోనా వ్యాప్తికి కారణం అవుతున్నాయని తేలడంతో.. రాహుల్ గాంధీ మరో మాట లేకుండా ర్యాలీల్ని రద్దు చేసుకున్నారు. ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా అదే చేయాలని ఆయన సూచించారు. ప్రజల భద్రత ముఖ్యమని ఆయన వాదన. బెంగాల్లో ఇప్పుడు బీజేపీ వర్సెస్ తృణమూల్ అన్నట్లుగా పోరు నడుస్తోంది. భారీ .. అతి భారీ సభలు.. ర్యాలీలలో రెండు పార్టీల నేతలు దీదీ, మోడీ హోరెత్తిస్తున్నారు.
కరోనా గురించి వారు పట్టించుకోవడం లేదు. ప్రజల గురించి పట్టించుకోవడం లేదు. ఇద్దరిలో ఒకరు ప్రధానమంత్రి.. మరొకరు ముఖ్యమంత్రి. అందుకే వీరి తీరుపై విమర్శలు వస్తున్నాయి. ప్రధానమంత్రి దేశంలో కోవిడ్ పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉందని చెబుతూ.. ఎన్నికల ర్యాలీలను ఎలా నిర్వహిస్తారని.. సామాన్య ప్రజల నుంచే ప్రశ్నలు వస్తున్నాయి. అయినా పట్టించుకోవడం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా… ప్రచారంపై ఆంక్షలు విధించింది. పోలింగ్‌కు మూడు రోజుల ముందే ప్రచారాన్ని ముగించాలని స్పష్టం చేసింది. ఇంకా బెంగాల్లో మూడు విడతల పోలింగ్ మిగిలి ఉంది.
ఒకే విడతలో నిర్వహించాలని మమతా బెనర్జీ డిమాండ్ చేసినా ఈసీ అంగీకరించలేదు. దీంతో ప్రచారం కొనసాగుతోంది. కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో మోదీ, దీదీపైనా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అనేక రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు విధిస్తూ.. కర్ఫ్యూలు.. లాక్ డౌన్ల స్టేజ్‌కు వచ్చిన సందర్భంలో బాధ్యతగల ప్రధానమంత్రి.. ముఖ్యమంత్రులు … ర్యాలీలు నిర్వహించడం సమంజసం కాదన్నదే ఎక్కువ మంది అభిప్రాయం. మరి ఈ అభిప్రాయాలను.. మోదీ, దీదీ పరిగణనలోకి తీసుకుంటారో లేదో..?