ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి తగ్గించే లక్ష్యంతో… అవినీతి నిరోధక శాఖ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న కేసుల్లో వంద రోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ లేఖ రాశారు. పక్కా ఆధారాలతో దొరికిన వారిపై వంద రోజుల్లో చర్యలు తీసుకోవాలని.. ఒక వేళ తీసుకోకపోతే.. ఆలస్యానికి కారణమైన వారిపై చర్యలు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. లంచాలు అడుగుతున్న వారి సమాచారాన్ని ఇస్తే.. ఏసీబీ అధికారులు రెయిడ్ చేస్తున్నారు. నేరుగా డబ్బులిచ్చేటప్పుడు పట్టుకుని కేసులు బుక్ చేస్తున్నారు.
అయితే ఇలా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినప్పటికీ.. ఉద్యోగులపై చర్యలుఉండటం లేదు. అలా కేసులు పాతబడిపోతున్నాయి. కొన్నాళ్లకు.. ఆ ఉద్యోగులు మళ్లీ విధుల్లో చేరుతున్నారు. మళ్లీ తమ బుద్ది ప్రకారం లంచాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వ్యవస్థ అంతా నిర్వీర్యం అయిపోతోంది. అవినీతి పరుల్ని ఏరివేయడం సాధ్యం కావడం లేదు. ఈ పరిస్థితిని అంచనా వేసిన ప్రభుత్వం… ముందుగా… దొరికిన వారికి కఠిన శిక్షలు.. ఓ టైమ్ లైన్ ప్రకారం వేస్తే.. ఉద్యోగుల్లో భయం పెరుగుతుందన్న భావనకు వచ్చింది. ఏసీబీ అధికారులు కూడా…తాము కష్టపడి ట్రాప్ చేస్తున్న కేసులు నిర్వీర్యం అవుతున్నాయని.. చర్యలు తీసుకోవడంలేదని.. ప్రభుత్వానికి నివేదిస్తున్నారు.
ఈ క్రమంలో.. ప్రభుత్వం వంద రోజుల టైమ్ లైన్ పెట్టింది. రెడ్ హ్యాండెడ్గా.. పక్కా ఆధారాలతో పట్టుకున్న వారిని ఇక వంద రోజుల్లో డిస్మిస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడా కూడా తన.. పర బేధాలతో చర్యలు తీసుకుంటే… ఈ ప్రయత్నమూ నీరుగారి పోయే ప్రమాదం ఉంది. లంచావతారాలందర్నీ ఒకే గాటన కడితే ప్రయత్నం ఫలవంతమవుతుంది.