ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా బోర్డును ఏపీలోకి అడుగు పెట్టకుండా చేయాల్సిందంతా చేస్తోంది. ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించాలని.. నిర్ణయించుకుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హుటాహుటిన లేఖ రాసింది. కరోనా పేరుతో భయపెట్టే ప్రయత్నం చేసింది. కరోనా కేసులు ఎక్కువగా పెరిగిపోతున్నాయని…భయపెడుతోంది. తెలుగు రాష్ర్టాల్లో కరోనా తీవ్రత అత్యధికంగా పెరిగిపోవటం…రాయలసీమ ప్రాంత ఇంజనీరింగ్ అధికారులు కూడా కరోనా వైరస్ బారిన పడటంతో…రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను సోమ, మంగళవారాల్లో పర్యవేక్షించాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శికి జల వనరుల శాఖ కార్యదర్శి జె. శ్యామలరావు కోరారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతుల్లేకుండా నిర్మించవద్దని కేంద్ర జలవనరుల శాఖ చాలా సార్లు లేఖలు రాసింది. అయితే ఏపీ సర్కార్ మాత్రం ఎలాంటి అనుమతుల్లేకపోయినా మేఘా కన్సార్టియంకు కాంట్రాక్ట్ ఇచ్చేసింది. పనులు కూడా ప్రారంభించింది. గతంలో అక్కడ పనులు జరుగుతున్నాయని కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. దీనిపై తెలంగాణ నుంచి కొంత మంది కేసులు వేశారు. ఈ క్రమంలో కృష్ణాబోర్డు ప్రాజెక్ట్ ప్రాంతాన్ని పరిశీలించాలని అనుకుంది. అక్కడ నిర్మాణం జరుగుతున్న విషయం కృష్ణాబోర్డు సభ్యులు పరిశీలించి రికార్డు చేస్తే.. తర్వాత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకే కృష్ణాబోర్డును రావొద్దని ఒత్తిడి చేస్తోంది. చెప్పాల్సినవన్నీ చెప్పింది. ఇప్పుడు కరోనా కారణాన్ని చెబుతోంది.
ఓ వైపు తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను ముందుగా పరిశీలించాలని ఏపీ సర్కార్ డిమాండ్ చేస్తోంది. అయితే.. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులన్నింటికీ.. గతంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓపెనింగ్‌కు స్వయంగా వెళ్లి రావడం.. ఉమ్మడి ప్రాజెక్టు కట్టాలని ప్రణాళికలు వేయడం వంటి కారణాల వల్ల.. తెలంగాణతో ఏపీకి పెద్దగా జల జగడాల్లేవని అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.