కరోనా కనివినీ ఎరుగని రీతిలో విజృంభిస్తూండటంతో.. అత్యధిక ప్రభావం ఉన్న రాష్ట్రాలు లాక్ డౌన్ పరిష్కార మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే పదిహేనురోజుల పాటు కర్ఫ్యూ ప్రకటించారు. ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ … ఢిల్లీలో లాక్ డౌన్ మినహా మరో మార్గం లేదని తేల్చేశారు. వారం పాటు లాక్ డౌన్ ప్రకటించారు. ప్రజలు అందరూ సహకరించాలని..అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఢిల్లీలో రోజుకు పాతిక వేల కేసులు చొప్పున నమోదవుతున్నాయి. వారం రోజుల్లో పరిస్థితి మెరుగుపడాలని.. పొడిగించే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నానని కేజ్రీవాల్ ప్రకటించారు. వలస కార్మికులు ఎక్కడకూ పోవద్దని వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
మరో వైపు కేంద్రం కూడా దేశవ్యాప్త ఆంక్షల దిశగా ఆలోచిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే లాక్ డౌన్ లాంటి ఆలోచనలు ఆయన చేయకపోవచ్చునని చెబుతున్నారు. ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశంలో నైట్ కర్ఫ్యూ గురించి ప్రస్తావన చేశారు. బహుశా.. ముఖ్య అధికారులు.. నీతి ఆయోగ్ ముఖ్యులతో సమావేశం తర్వాత దేశ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ ప్రకటించే అవకాశం ఉంది. కేసులు ఎక్కువగా ఉన్న చోట.. రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చునని కేంద్రం చెబుతోంది.
లాక్ డౌన్ పెడితే.. మళ్లీ ప్రజల ఆర్థిక పునాదులు కుంగిపోతాయని… దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుందన్న అభిప్రాయం ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో… ప్రజలను మరింత అప్రమత్తం చేయడమే తప్ప.. లాక్ డౌన్ పరిష్కారం కాదని అంటున్నారు. లాక్ డౌన్ వల్ల కేసులు గతంలోనూ తగ్గలేదని గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా… వ్యాపార సంస్థలు స్వచ్చందంగా సమయాన్ని తగ్గించుకుంటున్నాయి. రెండు, మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా… కఠినమైన ఆంక్షలు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.