ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం విషయంలో ఊదిన రివర్స్ టెండరింగ్ బుడగ పేలిపోయింది. పోలవరం ప్రధాన డ్యామ్ అంచనాలను రూ. పదహారు వందల కోట్లకుపైగా పెంచుతూ తాజాగా జలవనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ప్రస్తుతం పనులు చేస్తున్న మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి.. రివర్స్ టెండర్లో తాము పాడుకున్న మొత్తం కాకుండా.. అదనంగా రూ. పదహారు వందల కోట్లను చెల్లించబోతోంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులు చూసి.. అందరూ నోరెళ్లబెడుతున్నారు. ఎందుకంటే… ఈ ప్రభుత్వం రాగానే.. రివర్స్ టెండర్ పేరుతో ఆడిన రాజకీయ నాటకం.. ఇంకా కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది మరి.
మేఘా కంపెనీకి రూ. 1600 కోట్ల అదనపు చెల్లింపులు..!
పోలవరం ప్రాజెక్ట్ మొదట్లో ట్రాన్స్ ట్రాయ్ సంస్థ చేసేది. ఆ సంస్థ చేతులెత్తేయడంతో… నవయుగ కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. నవయుగ కంపెనీ ఈ కాంట్రాక్టును రూ. 5535 కోట్లకే చేస్తోంది. అప్పట్లో అంటే ఎనిమిదేళ్ల కిందటే ఈ మొత్తానికి పోలవరం పనులు చేపట్టడానికి నవయుగ ఆసక్తి చూపించలేదు. అందులో లాభం రాదని అనుకోవడమే కారణం. అయితే.. పోలవరం లాంటి ప్రాజెక్టు నిర్మాణ సంస్థగా చరిత్రలో నిలిచిపోతామన్న ఉద్దేశంతో ఆ కంపెనీ యజమానులు పనులు చేయడానికి అంగీకరించారు. విదేశాల నుంచి అత్యంత ఆధునిక …భారీ పరికరాలను తీసుకు వచ్చి రేయింబవళ్లు పనులు చేయించారు. పరుగులు తీయించారు. దీంతో పోలవరం కల సాకారం కాబోతోందన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది.
రూ. 780 కోట్లు తక్కువకు రివర్స్ టెండర్.. ఇప్పుడు రూ. 1600 కోట్లు నిలువు దోపిడి..!
అయితే వైసీపీ సర్కార్ రావడంతోనే.. సీన్ మారిపోయింది. పోలవరంలో అవినీతి అని.. చాలా పెద్ద మొత్తానికి నవయుగ కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారని ఆరోపిస్తూ.. రివర్స్ టెండరింగ్‌కు వెళ్లింది. మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి రివర్స్ టెండరింగ్ పేరుతో కట్ట బెట్టింది. రూ. 780 కోట్లకు తక్కువగా టెండర్ వేశారు. అంత తక్కువకు పనులు చేయడం ఎలా సాధ్యమని నిర్మాణ రంగ నిపుణులు అప్పట్లోనే ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయినా సరే.. మేఘా కంపెనీ రంగంలోకి దిగింది. అదే సమయంలో అంత పెద్దమొత్తంలో ఆదా చేశామని.. తాము రివర్స్ టెండరింగ్‌కు వెళ్లకపోతే.. ఆ మొత్తం టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్లేవని సాక్షాత్తూ సీఎం జగనే అనేవారు. కానీ ఇప్పుడు అది మొత్తం రివర్స్ అయింది. అప్పుడు రూ. 780 కోట్లు మిగిల్చి.. ఇప్పుడు రూ. పదహారు వందల కోట్లను అడ్డగోలుగా చెల్లించడానికి సిద్ధపడింది.
ప్రజలను పట్టపగలు మోసం చేసిన ప్రభుత్వం – మేఘా సంస్థ..!
ఇప్పుడు… ఆ పోలవరం హెడ్ వర్క్స్ అంచనాలను రూ. పదహారు వందల కోట్ల మేర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే… తగ్గించిన రూ. 780 కోట్లు కాకుండా.. మరో ఎనిమిది వందల కోట్ల వరకూ ఎక్కువ మొత్తాన్ని ప్రస్తుత కాంట్రాక్టర్‌కు చెల్లించబోతున్నారు. అంటే మేఘా ఇంజినీరింగ్ కంపెనీ… రెండేళ్ల కిందట…రూ. 780 కోట్లకు తక్కువ మొత్తానికి టెండర్ వేసి.. ఇప్పుడు ప్రభుత్వంతో లాబీయింగ్ చేసుకుని ఏకంగా పదహారు వందల కోట్ల రూపాయలను పొందబోతోందన్నమాట. ఇది అడ్డగోలు దోపిడి మాత్రమే కాదు.. పోలవరం ప్రాజెక్ట్ భవిష్యత్‌ను..భద్రతను పణంగా పెట్టడమన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది. నవయుగ కంపెనీ పనులు కొనసాగించి ఉంటే.. ఇప్పటికి ప్రధాన డ్యామ్ పూర్తయి ఉండేది. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ ఎక్కడిదక్కడే ఉంది. కానీ రివర్స్ టెండరింగ్ తో ప్రజాధనానికి .. మరింత టెండర్ పడింది.