కోవిడ్ భయాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సినిమాలూ వాయిదా పడుతున్నాయి. షూటింగులకూ ఆ ముప్పు ఏర్పడింది. తాజాగా `ఆచార్య` విషయంలో చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన షూటింగుకి పేకప్ చెప్పేశారు. ఇటీవల చిత్రబృందంలోని కీలకమైన వ్యక్తి సోనూసూద్… కోవిడ్ బారీన పడిన సంగతి తెలిసింది. అయినప్పటికీ…`ఆచార్య` షూటింగ్ కొనసాగించారు. కానీ.. ఇప్పుడు మాత్రం చిరు పునరాలోచలో పడినట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా షూటింగుల్ని నిలిపివేసినట్టు సమాచారం. కరోనా ఫస్ట్ వేవ్ లో భాగంగా… తొలుత షూటింగులకు పేకప్ చెప్పింది చిరంజీవినే. `ఆచార్య` షూటింగ్ ని చిరు అప్పట్లోనే నిలిపి వేశారు. ఇప్పుడు మరోసారి చిరు తొలి అడుగు వేసి, ప్రభుత్వం షూటింగులకు `నో` చెప్పక ముందే నిర్ణయం తీసేసుకున్నారు.
మరోవైపు ప్రభాస్ సినిమా `రాధే శ్యామ్` శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మరో పది రోజుల షూటింగ్ చేస్తే.. సినిమా పూర్తవుతుంది. అందుకే ఆ పనుల్లో నిమగ్నమైంది టీమ్. ప్రభాస్ – పూజా హెగ్డేపై ఓ పాట, కృష్ణం రాజు, ప్రభాస్‌లపై కొన్ని సన్నివేశాలు తెరకెక్కించాలి. ఈ షెడ్యూల్ లో ఆ పార్ట్ మొత్తం చిత్రీకరిస్తారు. దాంతో షూటింగ్ పూర్తవుతుంది. ఆదివారాలు సైతం.. రెండు షిఫ్టుల్లో చిత్రబృందం పనిచేస్తోందని, ఈసారి.. షూటింగ్ అంతా అయ్యాకే పేకప్ చెబుతారని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.