‘షాక్’తో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చినా, తన తడాఖా మాత్రం `మిరపకాయ్`తో బయటపెట్టాడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్‌తో కమర్షియల్ డైరెక్టర్‌గా ఎదిగిపోయాడు. ఆ తరవాత తన ప్రస్థానం తెలిసిందే. ఇప్పుడు పవన్ కల్యాణ్ తో మరో సినిమా చేయబోతున్నాడు. మైత్రీ మూవీస్ సంస్థ తెరకెక్కిస్తోంది. అయితే ఇప్పుడు రవితేజతోనూ.. తన కాంబోని రీపీట్ చేయబోతున్నాడట హరీష్. `మిరపకాయ్` తరవాత.. రవితేజతో మరో సినిమా చేయాలని అనుకుంటున్నా – ఇప్పటి వరకూ కుదర్లేదు. కానీ ఈసారి హరీష్ కథ కూడా సిద్ధం చేసేశాడని తెలుస్తోంది. ఇటీవలే హరీష్ – రవితేజలు కలుసుకున్నారని, ఇద్దరి మధ్యా కథా చర్చలు జరిగాయని సమాచారం. రవితేజ బాడీ లాంగ్వేజ్‌ని పూర్తిగా అర్థం చేసుకున్న దర్శకుడు హరీష్. తనకు మాస్, కమర్షియల్ సినిమాలు ఎలా చేయాలో బాగా తెలుసు. కాబట్టి.. ఈసారీ పక్కా మాస్ సినిమానే రాబోతోంది. పవన్ కల్యాణ్‌తో ప్రాజెక్టు అయ్యాక.. రవితేజ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఈ యేడాదే పవన్ – హరీష్ సినిమా ఉంటుంది. రవితేజ హ్యాట్రిక్ మూవీ కోసం 2022 వరకూ ఆగాలి.