తెలంగాణ బీజేపీలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ బీజేపీలో ముసలం ప్రారంభమయింది. హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు ముఖ్య నేతలపై చర్యలు తీసుకోవాలని.. బీజేపీ హైకమాండ్‌ను బండి సంజయ్ గట్టిగా కోరుతున్నారు. అందులో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన రామచంద్రరావు కూడా ఉన్నారు. రామచంద్రరావుతో పాటు ముగ్గుర్ని పార్టీ నుంచి పంపేయాలన్న పట్టుదలతో బండి సంజయ్ ఉన్నారు. దీనికి కారణం… వారంతా కేటీఆర్‌ను కలవడం. అంతే కాక.. కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో బండి సంజయ్‌ను పదే పదే తప్పు పట్టినట్లుగా బయటకు లీక్ అయింది. ఇది టీఆర్ఎస్ వైపు నుంచి లీక్ అయిందా.. బీజేపీ వైపు నుంచా అన్నది క్లారిటీ లేదు కానీ… బండి సంజయ్ పద్దతి బాగోలేదని.. కేటీఆర్‌తో సమావేశంలో పాల్గొన్న వారందరూ ఏకాభిప్రాయానికి వచ్చినట్లుగా సమాచారం బయటకు వచ్చింది.
కేటీఆర్‌తో బీజేపీ నేతల సమావేశానికి కారణం లింగోజిగూడ కార్పొరేటర్ స్థానం ఉపఎన్నిక. అక్కడ బీజేపీ తరపున గెలిచిన ఆకుల రమేష్ గౌడ్ చనిపోయారు. ఆయన కుమారుడు పోటీ చేస్తున్నారు. ఏకగ్రీవానికి సహకరించాలని కేటీఆర్ వద్దకు ఎమ్మెల్సీ రామచంద్రరావు నేతృత్వంలోని బృందం వెళ్లింది. దానికి కేటీఆర్ అంగీకరించారు. అదే సమయంలో… తెలంగాణ బీజేపీలో ఒక్క బండి సంజయ్‌తో తప్ప .. ఎవరితోనూ టీఆర్ఎస్కు గొడవల్లేవని కేటీఆర్ చెప్పారు. అంతా బండి సంజయ్ దే తప్పన్నట్లుగా చెప్పడం..దానికి అందరూ ఔను.. ఔను అనడం జరగిపోయాయి. ఈ ఉత్సాహంతో కేటీఆర్ కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కు కూడా ఫోన్ చేసి.. లింగోజీ గూడ కార్పొరేటర్ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని కోరారు. అయితే అది మల్కాజిగిరి పార్లమెంట్ కిందకు వస్తుంది. రేవంత్ రెడ్డి తన అనుచరుడితో నామినేషన్ కూడా వేయించేశారు. అయితే కేటీఆర్ ఓ ప్రయత్నం చేసినట్లుగా బీజేపీ నేతల మనసుల్లో ముద్రపడిపోయింది.
ఈ పరిణామాలన్నీ బండి సంజయ్‌కు తెలియడంతో ఆయన నిజనిర్ధారణ కమిటీ వేశారు. నివేదిక తెప్పించుకున్నారు. గ్రేటర్‌కు చెందిన ముగ్గురు నేతలు క్రమశిక్షణ ఉల్లంఘించారని నిర్ణయించుకున్నారు. వారిపై వేటు వేయించేందుకు ఇప్పుడు కసరత్తు చేస్తున్నారు. ఆరెస్సెస్ వైపు నుంచి ప్రయత్నిస్తున్నారు. పార్టీని బలహీనం చేయడమే కాకుండా.. అంతా తనదే తప్పు అని చెప్పే ప్రయత్నం చేయడమే సంజయ్ ను ఆగ్రహానికి గురి చేస్తోంది. మరో వైపు బండి సంజయ్ ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు గ్రేటర్ నేతలు కూడా తమ పలుకుబడి ఉపయోగించుకుంటున్నాయి. బండి సంజయ్‌పై ఎదురు ఫిర్యాదులు చేస్తున్నారు. కేటీఆర్ ఒక్క కార్పొరేటర్ స్థానాన్ని వదిలేసినా.. బీజేపీలో మాత్రం విజయవంతంగా చిచ్చు పెట్టగలిగారని.. బండి సంజయ్‌పై వ్యూహాత్మకంగా నేతల్ని ఎగదోశారని టీఆర్ఎస్లో చర్చ జరుగుతోంది.