ఆంధ్రప్రదేశ్ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే పనిలోకి దిగారు. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేశారు. హైకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోలేదు. ఆ వివాదం … ఎన్నికలు జరిగి.. కౌంటింగ్ కోసం ఎదురు చూడాల్సిన స్టేజ్‌లో ఉంది. అయితే ఇంకా.. దాదాపుగా ముఫ్పైకి పైగా మున్సిపాల్టీలకు.. రాజమండ్రి, నెల్లూరు లాంటి కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిని కూడా ఈ నెలలోనే పూర్తి చేస్తామని.. మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు. షెడ్యూల్ కూడా రెడీ అయిందని వైసీపీ అధికారిక మీడియాలో ప్రచారం జరిగింది. అయితే.. అవన్నీ ఆగిపోవడానికి కారణం కోర్టు కేసులు.
సమీప గ్రామాలను మున్సిపాల్టీల్లో విలీనం చేయడంతో.. ఆయా గ్రామాల వారు కోర్టులకు వెళ్లారు. దాంతో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాలేదు. అయితే కోర్టు కేసుల్ని కూడా పెద్దగా పట్టించుకోకుండా నోటిఫికేషన్ ఇచ్చేస్తారన్న ప్రచారం జరిగింది. ఎందుకంటే… నోటిఫికేషన్ ఇచ్చేశాక.. కోర్టు జోక్యం చేసుకోకూడదన్న వాదన వినిపిస్తారని కూడా చెప్పుకున్నారు. అయితే అనూహ్యంగా ఇప్పుడు హైకోర్టులో ఎస్ఈసీ తరపు న్యాయవాది యూటర్న్ తీసుకున్నారు.కోర్టు కేసులు, జనాభా లెక్కింపు, ఓటర్ల జాబితాలో ఇబ్బందులున్నాయని …కోర్టులో పిటిషన్లు పెండింగ్‌లో ఉండటంతో ఎన్నికలు నిర్వహించబోమని స్పష్టం చేసింది.
సమస్యలు తొలిగాక ఎన్నికలు జరుపుతామని తెలిపింది. కోర్టు కేసులు తేలడం అంత తేలిక కాదు. ప్రస్తుతం కరోనా కారణంగా విచారణలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ఈ ప్రకారం చూస్తే.. ఇక మున్సిపల్ ఎన్నికల ఆలోచన ప్రభుత్వం చేయకపోవచ్చునని చెబుతున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులు.. కర్ఫ్యూ, లాక్ డౌన్ దిశగా వెళ్తున్నందున ఎన్నికలు పెట్టే పరిస్థితి కూడా లేదని చెబుతున్నారు.