ప్రధానమంత్రి నరేంద్రమోడీ … ఉపిరి బిగబట్టి.. ఉక్కబట్టుకుని చూస్తున్న ప్రజలకు… కాస్త ఊపిరి పీల్చుకునే చాన్సిచ్చారు. లాక్ డౌన్ ప్రకటించాల్సిన అవసరం లేదని ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని చుట్టముట్టేసిన క్రమంలో.. ఇక లాక్ డౌన్ ప్రకటిస్తారేమోనని అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో మోడీ.. భిన్నమైన ప్రకటన చేశారు. లాక్ డౌన్ చేసే ఆలోచన లేదని ప్రకటించారు. అయితే.. లాక్ డౌన్ భయాలను మాత్రం ప్రజలకు వదిలి పెట్టారు. కరోనా నిబంధనలు పాటించకపోతే.. లాక్ డౌన్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుందని ప్రజలను పరోక్షంగా హెచ్చరించారు. లాక్ డౌన్ అనేది అవకాశమని.. ప్రజలందరూ.. కరోనా నిబంధనలు పాటించి.. కరోనాను దూరం చేసి.. దేశాన్ని లాక్ డౌన్ బారి నుంచి కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కరోనా విషయంలో ప్రజలందరూ కలసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని మోడీ స్పష్టం చేశారు. టీకా అంశంపై మోడీ ఎక్కువగా మాట్లాడారు. ప్రపంచంలోనే అతి పెద్ద వాక్సినేషన్ ప్రోగ్రాం ఇండియాలో నడుస్తోందని.. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వేస్తే.. నగరాల్లో పరిస్థితులు మెరుగుపడతాయని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనాపై తీవ్రమైన యుద్ధమే చేస్తున్నామని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమయిందని స్పష్టం చేసింది. దేశంలో ఆరోగ్య పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయని.. ఆక్సీజన్ అవసరం పెరిగిందన్నారు. కొత్త ఆస్పత్రులు.. కొత్త ఆక్సీజన్ ఉత్పత్తి కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించారు.
మొదటి విడత కరోనా వేవ్ సమయంలో మోడీ ఇలా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రతీ సారి.. లాక్ డౌన్ విధించడమో.. పొడిగించడమో చేశారు. మధ్యలో ప్రజలకు కొన్ని టాస్క్‌లు ఇచ్చారు. దీపాలు పెట్టడం.. చప్పట్లు కొట్టడం.. లాంటి టాస్క్‌లు నడిచాయి. అయితే ఈ సారి మాత్రం మోడీ ప్రజలకు ఎలాంటి టాస్క్‌లు ఇవ్వలేదు. అందరూ.. కరోనా నిబంధనలు పాటించాలని మాత్రం విజ్ఞప్తి చేశారు. కేంద్రం తరపున తీసుకుంటున్న చ్రయలను వివరించారు.