ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో పారదర్శకత అనే మాటను పక్కన పెట్టేసింది. అధికారంలోకి వచ్చిన కొత్తలో పోలవరంలో అంతా అవినీతి పారుదలేనని ఆరోపించి… ఇప్పుడు అంత కంటే ఎక్కువ ధరలకు పనులు చేయిస్తోంది. ఈ వ్యవహారం మొత్తం గూడుపుఠాణిలాగా ఉందే అని ప్రజలు అనుకుంటున్న సమయంలో.. పూర్తి వివరాలు వెల్లడించడానికి కూడా సర్కార్ సిద్ధపడటం లేదు.
కొత్త ఎత్తిపోతల ఎక్కడ కడతారు..?
తాజాగా.. జలవనరుల శాఖ అధిక చెల్లింపులకు అనుమతి ఇస్తూ.. మరో ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదేమిటంటే… పోలవరం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీని వాడుకునేందుకు.. ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. నిజానికి పోలవరం నీటిని ఎత్తిపోయడానికి ఇప్పటికే పట్టిసీమ, పులిచింతల ఉన్నాయి. మరొకటి ఎక్కడ కడతారు అనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంచారు. చింతలపూడి , పట్టిసీమ ఎత్తిపోతల పథకాలు ఉండగా కొత్తగా పోలవరం డెడ్ స్టోరేజీ 38 మీటర్ల నుంచి నీటిని ఎత్తిపోసేందుకు రూ.9132 కోట్ల ఖర్చుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఎత్తి పోతల నిర్మాణానికి హేతుబద్దత ఏమిటన్నది జలవనరుల శాఖ నిపుణులకే అర్థం కావడం లేదు.
ప్రాజెక్ట్ సామర్థ్యాన్ని 25 టీఎంసీలకు తగ్గించాలని నిర్ణయించారా..?
డెడ్ స్టోరేజీ ద్వారా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగు నీరు అందించేందుకు ఈ ఎత్తిపోతల నిర్మాణమని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తారన్న ప్రచారం ఉంది. హెడ్ వర్క్స్ పూర్తి చేయకుండా ఉన్న నీటిని తోడేయడానికి ఇలా ప్రణాళిక సిద్ధం చేశారని చెబుతున్నారు. డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీటిని తోడేయడం అంటే పోలవరం సాగునీటి ప్రాజెక్టును 196 టీఎంసీల నీటి నిల్వ నుచి 25 టీఎంసీల నీటి నిల్వకు పరిమితం చేయడమేనని అనుమానిస్తున్నారు. అంటే గతంలో ప్రచారం జరిగినట్లుగా పోలవరంను బ్యారేజీ స్థాయిలో ఉంచబోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పోలవరంను నిర్వీర్యం చేసే కుట్ర ప్లాన్ ప్రకారం జరుగుతోందా..!?
పోలవరం ప్రధాన డ్యామ్‌ను పూర్తిచేసినా నీళ్లు నిల్వ చేయాలంటే.. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే… నీళ్లు నిల్వ చేయలేరు. ఆర్ అండ్ ఆర్ పూర్తి చేయాలంటే.. ఇప్పటికిప్పుడు ముఫ్పై ఐదు వేల కోట్లు కావాలి. కానీ.. కేంద్రం అసలు ఇచ్చేది లేదంటోంది. రాష్ట్రం భరించడానికి సిద్ధంగా లేదు. ఈ పీటముడి మధ్య మొత్తంగా పోలవరం ప్రాజెక్టుకే టెండర్ పెట్టడానికి కొత్త ఎత్తిపోతలను సిద్ధం చేశారన్న ప్రచారం జరుగుతోంది.