తిరుపతి ఉపఎన్నికల్లో పడిన దొంగ ఓట్ల అంశం ఆధారాలతో సహా కళ్ల ముందు ఉంది. దొంగ ఓటర్లు ఎవరో.. ఎక్కడి నుంచి వచ్చారో కూడా స్పష్టమయిది. ఈ ఆధారాలన్నింటితో… కలిపి రాజకీయ పార్టీలన్నీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాయి. చంద్రబాబు పన్నెండు పేజీల లేఖ రాశారు. బీజేపీ అభ్యర్థి ఫిర్యాదు చేశారు. ఇతర పార్టీల నేతలూ చేశారు. అయితే సీఈసీ ఇంత వరకూ స్పందించలేదు. రాజకీయ పార్టీల ఫిర్యాదులు మాత్రమే కాదు… రిటర్నింగ్ అధికారి నివేదికను కూడా.. సీఈసీ పరిగణనలోకి తీసుకుంటుంది కాబట్టి.. ఆయన నివేదిక వెళ్లే వరకూ చూశారు. రిటర్నింగ్ అధికారి.. మైక్రో అబ్జర్వర్ల నివేదికను క్రోడీకరించి… పూర్తి స్థాయి నివేదికను తిరుపతికి పంపించి.. రెండు రోజులు అయింది. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
కేంద్ర ఎన్నికల సంఘం తరపున ఇక్కడ సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్ సీఈవోగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన దొంగ ఓటర్లపై తాము చేసిన ఫిర్యాదులకు పూర్తి స్థాయిలో స్పందించలేదని.. కనీసం బయట ఓటర్లు తిరుపతిలోకి రాకుండా బందోబస్తు ఏర్పాటు చేయించడంలోనూ విఫలమయ్యారని .. టీడీపీ నేతలు మండిపడ్డారు. ఎన్నికల వ్యవస్థ అంతా.. అధికార పార్టీ కనుసన్నల్లో పని చేసిందని.. వాలంటీర్లు.. సచివాలయ సిబ్బంది వినియోగం వద్దని చెప్పినా… అవి ఆదేశాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. ఇప్పుడు ఆయన నివేదిక ఏమని పంపారో … స్పష్టత లేదు. సీఈవో విజయానంద్ ఒక వేళ… తిరుపతి ఉపఎన్నికల్లో దొంగ ఓట్లు పోల్ కాలేదని నివేదిక పంపితే.. ఇక ఎలాంటి రీపోలింగ్ ఉండే అవకాశం లేదు.
సీఈవో విజయానంద్ అధికార పార్టీకి మద్దతుగా ఉంటారని ఎక్కువ మంది నమ్ముతూండటంతో అభ్యర్థులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ… కోర్టును ఆశ్రయించారు. దొంగ ఓటర్ల సంగతి తేల్చే వరకూ ఫలితాన్ని ప్రకటించకుండా మధ్యంతర ఆదేశాలివ్వాలని… ఎన్నికల ప్రక్రియను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. సీఈసీ అనుకూల నిర్ణయం తీసుకోకపోతే.. టీడీపీ కూడా అదే పని చేయాలన్న ఆలోచన చేస్తోంది. మొత్తానికి తిరుపతిలో రీపోలింగ్ నిర్వహించకపోతే.. భవిష్యత్‌లో ఈ దొంగ ఓట్ల వ్యవహారం విస్తృతమవుతుందనే ఆందోళన మాత్రం ప్రజాస్వామ్యవాదుల్లో కనిపిస్తోంది.