ప్రజలదే బాధ్యత. వారు అజాగ్రత్తగా ఉంటే వారికే సమస్యలు. వారి బాధ్యత వారు తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సమస్యలు కూడా వారికే వస్తాయి. అంతా ప్రజల చేతుల్లో ఉన్నప్పుడు తాము ఏమైనా చేయడం కరెక్ట్ కాదని అనుకుంటోంది ఏపీ ప్రభుత్వం. అందుకే ఎలాంటి ఆంక్షలు పెట్టదల్చుకోలేదు. కరోనా విషయంలో అంతా ప్రజలకే వదిలేసింది. ఏపీ ప్రభుత్వం కరోనా విజృంభిస్తున్నా ఎలాంటి ఆంక్షలు పెట్టాలని అనుకోవడం లేదు. ప్రజల్ని అప్రమత్తం చేయడం దిశగానే ప్రయత్నం చేయాలనే ఆలోచనలో ఉంది. మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం, శానిటైజేషన్ వంటి వాటి పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, వాక్సినేషన్‌ను కూడా వీలైనంత ఎక్కువమంది వేసుకొనే విధంగా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. తప్ప ఆంక్షల జోలికి వెళ్లాలని అనుకోవడంలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో మరోనా సెకండ్‌వేవ్ ఎక్కువగానే ఉంది. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా లభించడం లేదు. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పదివేలకు చేరే అవకాశం కనిపిస్తోంది. దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి ఉండటంతో లాక్ డౌన్, కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలు చేస్తున్నారు. కానీ.. ఏపీలో మాత్రం అలాంటివి చేయడం లేదు. కనీసం పరీక్షలను కూడా ర్దు చేయడం లేదు. మెట్రో సిటీలు లేని ఏపీలో నైట్ కర్ఫ్యూ పెట్టడం హాస్యాస్పదం అని.. ఏపీ అధికారులు అంచనా వేస్తున్నారు. అందు ఆ ఆలోచన చేయడం లేదు.
ప్రభుత్వం కూడా… ఎలాంటి ఆంక్షలు పెట్టినా.. తమ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుందని భయపడుతోంది. గత లాక్ డౌన్ వల్ల.. నలభై వేల కోట్ల ఆదాయం తగ్గిపోయిందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సారి లాక్ డౌన్ కారణంగా అప్పులు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అన్నీ రాష్ట్రాలకే వదిలేసారు. దీంతో ఏపీ సర్కార్.. వీలైనంతగా వ్యాక్సిన్లకు ప్రాధాన్యం ఇచ్చి.. ప్రజల రోజువారీ జీవనాన్ని యథావిథిగా కొనసాగనివ్వాలని అనుకుంటోంది. అయితే ప్రజల్లో మాత్రం భయం ప్రారంభమయింది. వారికి వారే స్వచ్చందంగా ఆంక్షలు విధించుకుంటున్నారు. గుంటూరు వంటి చోట్ల… ఇప్పటికే కొన్ని ఆంక్షలు ప్రకటించారు. మొత్తంగా.. నిబంధనల విషయాన్ని ఢిల్లీ స్థాయిలో కేంద్రం రాష్ట్రాలకు వదిలిస్తే..ఏపీ సర్కార్.. రాష్ట్ర స్థాయిలో.. పంచాయతీలు, మున్సిపాల్టీలు.. కార్పొరేషన్లకు వదిలేస్తోంది.