చిరు, బాలయ్య, నాగ్, వెంకీలది ఓ తరం. వీళ్లంతా ఇప్పుడు యమ ఫాస్ట్ గా ఉన్నారు. సినిమాలపై సినిమాల్ని ఒప్పుకుంటున్నారు. ఓ సినిమా సెట్స్‌పై ఉండగానే, మరో సినిమాకి సంతకాలు చేసేస్తున్నారు. బాలయ్య కూడా మహా స్పీడే. ఆయనతో కథ ఓకే చేయించుకోవడం చాలా సులభమన్నది దర్శకుల.. మాట. తాజాగా అనిల్ రావిపూడి కథకు ఓకే చెప్పేశాడు బాలయ్య.
టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ దర్శకుడు అనిల్ రావిపూడి. `పటాస్` సమయంలోనే `రామారావుగారు` అనే ఓ కథ రెడీ చేసుకుని బాలయ్యకు వినిపించాడు. కానీ అదెందుకో అప్పుడు వర్కవుట్ కాలేదు. ఇప్పుడు మాత్రం.. రావిపూడి కథకు పచ్చ జెండా ఊపేశాడు. సాధారణంగా.. బాలయ్య లాంటి హీరో దొరికితే, ఫ్యాక్షన్, యాక్షన్ మిక్స్ చేసే కథలు ఎంచుకుంటారు. బోయపాటి శ్రీనులా. కానీ.. బాలయ్యని నెవర్ బిఫోర్ అవతారంలో చూపించబోతున్నాడట అనిల్ రావిపూడి. తన బలం.. కామెడీ. సో… దాన్ని వదలకుండా బాలయ్యతో వినోదం పండించబోతున్నాడట. యాక్షన్ కంటే.. ఎంటర్టైన్మెంట్ కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని, బాలయ్య గెటప్, క్యారెక్టరైజేషన్, డైలాగ్ డెలివరీ.. ఇవన్నీ కొత్తగా ఉండబోతున్నాయని. బాలయ్యని ఉగ్ర నరసింహ అవతారంలో కాకుండా.. చాలా సామాన్యంగా చూపించబోతున్నాడని తెలుస్తోంది. బహుశా.. `రామారావు` కథనే.. రావిపూడి అటూ ఇటూ మార్చి వినిపించి ఉంటాడు. మొత్తానికి వరుసగా సూపర్ హిట్లు కొడుతున్న రావిపూడితో బాలయ్య సినిమా చేయడం..నందమూరి అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తుతోంది.