కరోనా వ్యాప్తి కారణంగా నైట్ కర్ఫ్యూ దశకు చేరిన తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు మాత్రం యథావిధిగా జరగనున్నాయి. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది. ముప్పయ్యో తేదీన పోలింగ్ జరగనుంది. అయితే పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఈ కారణంగా మున్సిపల్ ఎన్నికలను రద్దు చేయాలంటూ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. తాము ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని…ఎన్నికల సంఘం.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఆలోచన ఏమిటో తెలుసుకోవాలని ఎస్ఈసీ అనుకుంది. వెంటనే… ప్రభుత్వానికి ఎస్ఈసీ లేఖ రాశారు. అయితే దీనిపై అధికారుల స్థాయిలో నిర్ణయం తీసుకోలేరు కాబట్టి… సమాచారాన్ని సీఎం కేసీఆర్ వద్దకు పంపించారు. ఆయన ఎన్నికలు నిర్వహించాలనే అభిప్రాయంతో ఉండటంతో.. ఈ నెల 30న ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులు లేవని ఎస్ఈసీకి సమాచారం పంపింది. కొవిడ్ జాగ్రత్తలతో ఎన్నికలు నిర్వహణకు.. అన్ని ఏర్పాట్లు చేస్తామని ఎస్ఈసీకి ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల నిర్వహణ ఖాయంగా జరగనుంది. ఇప్పటికే ఆయా కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో.. టిక్కెట్ల ఖరారులో పార్టీలు బిజీగా ఉన్నాయి.
రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. వారం రోజుల ప్రచార గడువు ఉంటుంది. అయితే ఈ సమయంలోనే ఎక్కువగా కరోనా వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన ఉంది. అందుకే ఎన్నికల ప్రచారం విషయంలో కఠిన నిబంధనలు పెట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. నైట్ కర్ఫ్యూ మాత్రమే విధించారు కాబట్టి… ఎన్నికల నిర్వహణకు అడ్డంకేమీలేదని.. టీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు.