ఉచిత వ్యాక్సిన్ అంటూ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించాయి. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు ఓ అడుగు ముందుకేసి మేనిఫెస్టోల్లో పెట్టారు. అప్పటికి వ్యాక్సిన్లు అందుబాటులోకి రాలేదు. అయినా బీహార్ ఎన్నికల్లో అందరికీ వ్యాక్సిన్ అనే హామీ ఇచ్చేశారు. అక్కడ మంచి ఫలితం పొందారు. ఆ తర్వాత ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా మేనిఫెస్టోల్లో ఉచిత వ్యాక్సిన్ హామీ మాత్రం కంపల్సరీగా ఉంది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. వ్యాక్సిన్ సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మాత్రం.. అందరూ కొనుక్కోవాల్సిందేనంటూ కొత్త నాటకం మొదలు పెట్టారు.
నలభై ఐదేళ్లు దాటిన వారికి మాత్రమే కేంద్రం ఉచిత వ్యాక్సిన్ ఇస్తుందని.. పద్దెనిమిదేళ్లు దాటిన వారందరూ… కొనుక్కుని టీకాలు వేయించుకోవాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ప్రజలు అవాక్కవ్వాల్సి వచ్చింది. వ్యాక్సిన్ రేటు కూడా తక్కువేమీ కాదు. కోవాగ్జిన్ రేటు ఎంతో ఇంకా ప్రకటించలేదు కానీ.. కోవిషీల్డ్ మాత్రం.. రూ. ఆరు వందలకు ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తామని సీరం సంస్థ ప్రకటించింది. అది వినియోగదారుకు చేరే సరికి మరో రెండు వందలు ఎక్కువ అవుతుంది. ఎలా లేదన్నా రెండు డోసులకు పదిహేను వందలు వదిలించుకోవాల్సిందే. విదేశీ టీకాలు ఎక్కువ ఖర్చు అవుతాయి. ఇంట్లో నలుగురు ఉంటే.. ఆ ఫ్యామిలీ ఆరు వేల రూపాయలు టీకాలకు ఖర్చు పెట్టాలి. దేశంలో ఉన్న అన్ని కుటుంబాలు ఇలా ఖర్చు పెట్టే పరిస్థితుల్లో ఉండవు. కానీ కేంద్రం పట్టించుకోలేదు. ఇచ్చిన హామీలను కూడా పరిగణనలోకి తీసుకోలేదు. అయితే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం… తాము ఉచితంగా తమ ప్రజలకు వ్యాక్సిన్లు అందిస్తామని ప్రకటించారు.
అసోం, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తామని ప్రకటించాయి. ఎన్నికల్లో హామీలు ఇచ్చిన వారు సైలెంట్ గా ఉండగా.. ఇతర రాష్ట్రాలు మాత్రం తమ ప్రజలపై బాధ్యత తీసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేస్తాయో స్పష్టత లేదు. ప్రభుత్వాలకు అయితే.. తక్కువ మొత్తాలకే కంపెనీలు సరఫరా చేస్తాయి. అందుకే ప్రభుత్వాలే భారం భరించి అందరికీ టీకాలు ఇప్పిస్తే.. కనీసం ఎన్నికల హామీని అయిన నిలబెట్టుకున్నట్లు అవుతుంది. లేకపోతే ప్రజలే సందర్భం వచ్చినప్పుడు తమ టీకాను ఓటు రూపంలో వేస్తారు.