ఇప్పుడు దేశం అంతా ఆక్సీజన్ ఫోబియాలో ఉంది. ఆక్సీజన్.. ఆక్సీజన్ అని.. దేశం నలువైపుల నుంచి పేషంట్లు కలవరిస్తున్నారు. కేంద్రం కూడా అదే చిక్కుల్లో ఉంది. ఇప్పుడు ప్రభుత్వాల కష్టాలను తీర్చడానికి… విశాఖ స్టీల్ ప్లాంట్ ముందుకు వచ్చింది. స్టీల్ ప్లాంట్‌లో ఉన్న ఆక్సీజన్ ప్లాంట్ ద్వారా.. పెద్ద ఎత్తున ఆక్సీజన్ ఉత్పత్తి చేసి అవసరమైన చోటుకు పంపుతోంది. ఏకంగా ట్యాంకర్లను నింపి.. రైళ్ల ద్వారా మహారాష్ట్ర వంటి చోటుకు పంపుతోంది. దేశ నిర్మాణానికి అవసరమైన స్టీల్‌నే కాదు.. ప్రాణాలను నిలబెట్టే ఆక్సీజన్‌ను కూడా అందించగలమని స్టీల్ ప్లాంట్ నిరూపించింది.
ఈ విషయంలో ఒక్క శాతం నిర్లక్ష్యం కూడా లేదు. సిబ్బంది కూడా రేయింబవళ్లు పని చేసి.. ఆక్సీజన్ ఉత్పత్తి చేసి… తమ అవసరాలకు లోటు లేకుండా చేసుకుంటున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడుతున్నారు. స్టీల్ ప్లాంట్‌లో ఉత్పత్తి అవసరాల కోసం నిత్యం లిక్విడ్ ఆక్సిజన్ తయారు చేస్తుంటారు. ఈ ప్లాంట్‌లో మొత్తం 5 ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. కరోనా మొదటి వేవ్ సమయంలోనూ.. పెద్ద ఎత్తున ఆక్సిజన్‌ను ప్రజలకు అందించారు. రోజుకు 100 టన్నుల చొప్పున వారం రోజుల్లో 700 టన్నులకు పైగా ఆక్సిజన్‌ను అందించారు.
నిజానికి స్టీల్ ప్లాంట్‌లో రోజుకు రెండున్నర వేల టన్నుల లిక్విడ్ ఆక్సీజన్ తయారు చేసే ప్లాంట్లు ఉన్నాయి. అత్యవసరం అయితే.. స్టీల్ ఉత్పత్తిని నిలిపివేసి..ఆ అక్సిజన్ ను ప్రాణాలను కాపాడటానికి ఉపయోగించవచ్చు. కానీ ఆ ఆక్సిజన్‌ను రవాణా చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాలే రెడీగా లేవు. దాంతో కావాల్సింత ఆక్సిజన్ ఉన్నా… అవసరమైన చోటుకు చేర్చుకోలేని పరిస్థితి వల్ల వందల ప్రాణాలు పోతున్నాయి.