వైయస్ఆర్ సీపీ నేత విజయసాయిరెడ్డి మరొకసారి పవన్ కళ్యాణ్ పై వెటకారపు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు కరోనా సోకడం పై ఆయన చేసిన వ్యాఖ్యల పై మండిపడుతున్నారు పవన్ ఫ్యాన్స్. వివరాల్లోకి వెళితే..
వైఎస్సార్ సీపీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ, “చంద్రబాబు కరోనా వ్యాక్సినేషన్ ఎప్పుడు తీసుకున్నాడు? పావలాకు అసలు కరోనా పాజిటివ్ వచ్చిందా, వస్తే మూడ్రోజుల్లోనే నెగెటివ్ ఎలా అయింది? వైద్య శాస్త్రం పరిధిని దాటిన ఈ రెండు అంశాలు అందరిలో ఆసక్తిని రేపుతున్నాయి. WHO సైంటిస్టులెవరైనా పరిశోధన చేస్తే బాగుండు.” అని రాసుకొచ్చారు. అయితే దేశంలోనూ రాష్ట్రంలోనూ కరోనా విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో, దీనిని కూడా ఆయన రాజకీయం చేయడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో విజయసాయిరెడ్డికి ఇదే కరోనా వైరస్ సోకితే ఆ సమయంలో నాగబాబు, రాజకీయాలకు అతీతంగా స్పందించారని విజయసాయిరెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారని, కానీ విజయసాయిరెడ్డి మాత్రం పవన్ కళ్యాణ్ విషయంలో దానికి రివర్స్ లో స్పందిస్తున్నారని పవన్ అభిమానులు వాపోతున్నారు.
మరికొందరు మాత్రం వివేకానంద రెడ్డి హత్య కేసు సమయంలో సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉండగా కరోనా వైరస్ సోకింది అన్న పేరు చెప్పి విజయసాయి రెడ్డి హైదరాబాద్ పారిపోయాడని, సిబిఐ బృందం వెళ్ళిపోగానే తిరిగి వచ్చాడని, అలాంటి విజయసాయిరెడ్డి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని ఎద్దేవా చేస్తూ మాట్లాడటం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ట్విట్టర్ లో దురుసు వ్యాఖ్యలతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు విజయసాయిరెడ్డి.