మాజీ మంత్రి దేవినేని ఉమకు కాస్త ఊరట లభించింది. ఎలాగైనా తనను అరెస్ట్ చేసి.. రెండు, మూడు రోజులు జైల్లో పెట్టాలనుకుంటున్నారని గట్టిగా నమ్మిన దేవినేని ఉమ సీఐడీ విచారణకు డుమ్మా కొట్టి..తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను కొట్టి వేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు… విచారణకు హాజరవ్వాలని దేవినేని ఉమను ఆదేశించింది. అయితే.. దేవినేని ఉమకు ఊరటనిచ్చేలా పలు ఆదేశాలిచ్చింది. దేవినేని ఉమకు 41ఏ కింద రక్షణ కల్పించాలని… మే 7 తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. దీంతో అరెస్ట్ చేసే అవకాశం లేదు.
ఈ నెల 29న ఉదయం 11 గంటలకు మంగళగిరి సీఐడీ ఆఫీసులో.. విచారణకు దేవినేని ఉమ హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. వచ్చే నెల ఏడో తేదీన తదుపరి విచారణ జరుగుతుంది. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో దేవినేని ఉమ… ఓ వీడియోను ప్రదర్శించారు. తిరుపతిలో ఉండటానికి ప్రజలు ఇష్టపడరని జగన్ ఓ సందర్భంలో అన్న మాటనలు ఆయన ప్రదర్శించారు. అవి మార్ఫింగ్ అంటూ.. కర్నూలులో ఓ వైసీపీ కార్యకర్త సీఐడీకి ఫిర్యాదు చేయడం అఘమేఘాలపై కేసు నమోదు చేసి.. దేవినేని ఉమకు నోటీసులు జారీ చేశారు. అయితే దేవినేని ఉమపై పెట్టిన కేసుల్లో నాన్ బెయిలబుల్ ఉండటంతో అరెస్ట్ కోసమే పోలీసులు ఇలా చేస్తున్నారని టీడీపీ వర్గాలు అనుమానించాయి. రెండు సార్లు విచారణకు రావాలని సీఐడీ అధికారులు నోటీసులిచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు. ఇప్పుడు అరెస్ట్ నుంచి ఉమ రక్షణ పొందారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇరవైతొమ్మిదో తేదీన ఆయన సీఐడీ ఎదుట హాజరు కానున్నారు.