సీఎం జగన్ బెయిల్ రద్దు చేయించే వరకూ నిద్రపోనంటూ సవాల్ చేసిన రఘురామకృష్ణరాజుకు గుడ్ న్యూసా.. బ్యాడ్ న్యూసా అన్నది ఇరవైఏడో తేదీన తేలనుంది. ఆ రోజున రఘురామకృష్ణరాజు వేసిన బెయిల్ రద్దు పిటిషన్‌కు విచారణ అర్హత ఉందాలేదా అన్నది సీబీఐ కోర్టు నిర్ణయాన్ని ప్రకటించనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్‌పై సీబీఐ కోర్టు వాదనలు విన్నది. ముందుగా అసలు ఆ పిటిషన్‌కు విచారణ అర్హత ఉందో లేదో తేల్చాలని అనుకుంది. అసలు రఘురామకృష్ణరాజుకు పిటిషన్ దాఖలు చేసే అర్హత ఉందా.. ఆయనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం .. వంటి అంశాలపై వాదనలు వినిపించారు.
పిటిషన్ దాఖలు చేసే అర్హత ఉందని రఘురామ తరఫు న్యాయవాది వాదించారు. తాను జగన్ పార్టీకే చెందిన వ్యక్తినని.. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన ఎంపీగా తనకు బాధ్యత ఉందని.. పిటిషన్లోనే రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. ఆయన పిటిషన్‌కు పిటిషన్ విచారణ అర్హతపై ఈ నెల 27న సీబీఐ కోర్టు నిర్ణయం ప్రకటిస్తుంది. ఒక వేళ.. విచారణ అర్హత ఉందని భావిస్తే… సీబీఐ కోర్టు ప్రతివాదులందరికీ నోటీసులు పంపుతుంది. ప్రతివాదుల్లో సీబీఐ కూడా ఉంది. సీబీఐ వాదనలు ఎలా వినిపిస్తుందనేది అప్పుడు కీలకం అవుతుంది.
రఘురామకృష్ణరాజు వాదనలతో సీబీఐ ఏకీభవించి.. బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో వాదిస్తే.. సంచలనాత్మకం అవుతుంది. అలా కాకుండా… రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని భావిస్తే.. ఈ ఎపిసోడ్‌కు.. ఇరవై ఏడుతో ముగింపు పలుకుతుంది. అయితే రఘురామకృష్ణరాజు.. చాలా పెద్ద పెద్ద సవాళ్లు చేసి ఉన్నారు కాబట్టి.. ఆయన హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది.