కరోనా రెండో దశపై ఇంకా పోరాటమే ప్రారంభమే కాదు… తాము గెలిచేశామని ఏపీ మంత్రులు డబ్బా పట్టుకుని కొట్టుకోవడం ప్రారంభించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కర్నూలులో వైరస్ అంశంపై సమీక్షా సమావేశం పెట్టి… ఎప్పుడూ ఇచ్చే ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో కరోనా కట్టడిలో ఏపీ ముందంజలో ఉందని ప్రకటించుకున్నారు. ఏపీ ఏ విధంగా ముందంజలో ఉందో కానీ.. మంత్రి మాత్రం.. తాము గొప్పగా పని చేశామని చెప్పుకోవడానికి ప్రాదాన్యం ఇచ్చారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్… విజృంభిస్తోంది. రోజువారీ కేసులు మూడు లక్షలు దాటిపోయాయి. ఏపీలో ఈ కేసుల సంఖ్య రోజుకు పదివేల వరకూ ఉంది.
ఉన్న పదమూడు జిల్లాల్లో ఐదు జిల్లాల్లో పాజిటివిటీ రేటు యాభై శాతం ఉందని.. స్వయంగా మంత్రి గౌతం రెడ్డి ప్రకటించారు. అంటే పరిస్థితి డేంజర్ స్టేజ్‌ను కూడా దాటిపోయిందన్నమాట. అయినప్పటికీ.. దేశమంతా తమ వైపు చూసేలా.. కరోనాను కట్టడి చేస్తున్నామని మంత్రి బుగ్గన చెప్పుకోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. గతంలోనూ కరోనా కట్టడి కన్నా.. కట్టడి చేశామని పబ్లిసిటీ చేసుకోవడానికే ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందని… అందుకే చివరికి తెలంగాణ కన్నా ఎక్కువ మరణాలు. .ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కూడా అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది.
పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నప్పటికీ.. కనీస పాటి ఆంక్షలు కూడా పెట్టలేదు. వ్యాక్సిన్ విషయంలోనూ వెనుకబడే ఉన్నారు. అయినా సరే కట్టడిలో దేశంలో ముందంజలో ఉన్నామని చెప్పుకుంటున్నారు. మ్యాచ్ ప్రారంభం కాక ముందే గెలిచేశామని గప్పాలు కొట్టుకోవడం అంటే ఏమిటో ఏపీ మంత్రులు నిరూపిస్తున్నారు.