విశాఖ మెడ్‌టెక్ జోన్ .. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన పొగడ్తలు తెచ్చి పెడుతోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ… ఏపీ మంత్రి గౌతంరెడ్డికి ఫోన్ చేశారు. ముఖ్యమంత్రి జగన్‌పై ప్రశంసలు కురిపించారు. ఎందుకంటే.. గడ్కరీ సొంతప్రాంతం నాగపూర్‌లో కరోనా తీవ్రంగా ఉంది. వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. విశాఖ మెడ్ టెక్ జోన్లో అవి తయారవుతున్నాయని తెలిసి… ఆయన ఏపీ ప్రభుత్వ వర్గాలను సంప్రదించారు. వెంటనే… మూడు వందల వెంటిలేటర్లు నాగపూర్‌కు.. మెడ్‌టెక్ జోన్ నుంచి సరఫరా అయ్యాయి. వాటి ద్వారా కొన్ని వందల ప్రాణాలు నిలబెట్టవచ్చని… సంతోషపడిన గడ్కరీ.. చేసిన సాయాన్ని .. మర్చిపోకుండా నేరుగా మంత్రికి ఫోన్ చేసి.. తన ఆనందాన్ని వ్యక్తి చేసి.. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
నిజానికి ఈ మెడ్‌టెక్ జోన్‌పై సీఎం జగన్‌కు ఎప్పుడూ సదభిప్రాయం లేదు. చంద్రబాబు భవిష్యత్‌లో మెడికల్ టెక్నాలజీకి ఎంతో స్కోప్ ఉందని గుర్తించి.. విశాఖలో మెడ్‌టెక్ జోన్‌కు రూప కల్పన చేశారు. సైంటిస్ట్‌గా ఎంతో అనుభవం ఉన్న జితేందర్ శర్మను సీఈవోగా నియమించారు. జితేందర్ శర్మ ప్రపంచ ప్రఖ్యాత మెడికల్ ఎక్విప్మెంట్ పరిశ్రమలన్నీ .. ప్లాంట్లు పెట్టేలా కృషి చేశారు. ఆయన కృషి ఫలితంగా.. పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. చంద్రబాబు ఓడిపోగానే.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు హయాంలో జరిగిన కార్యక్రమాలన్నింటిపై కన్నేసినట్లుగానే..మెడ్‌టెక్ జోన్ పైనా కన్నేశారు. పలు రకాల విచారణలకు ఆదేశించారు. అక్కడ ఏం తేలిందో కానీ.. అదొక మయసభ అని మీడియాకు లీక్ చేశారు. కొన్ని వందల కోట్లు స్కాం జరిగిందనట్లుగా జగన్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ ఆరోపణలు మీడియాలో విస్తృతంగా ప్రచారంచేసి .. సీఈవో జితేందర్ శర్మను.. తొలగించేశారు. మెడ్‌టెక్ జోన్లో రెండో దశ విస్తరణ కోసం కేటాయించాల్సిన నిధుల్లో 90 శాతం కత్తిరించేశారు.
మెడ్ టెక్ జోన్ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై అప్పట్లో అంతర్జాతీయ పత్రికల్లోనూ విమర్శలు వచ్చాయి. మెడ్‌టెక్‌జోన్‌లో ప్లాంట్లు పెట్టిన.. పెట్టాలనుకున్న మెడికల్ కంపెనీలన్నీ నేరుగా ప్రధానమంత్రికి ఫిర్యాదు చేశాయి. పెట్టుబడులు పెట్టిన విదేశీ కంపెనీలు కూడా.. కేంద్రానికి ఈ వ్యవహారంపై లేఖలు రాశాయి. పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీయవద్దని కోరాయి. కేంద్రం… హెచ్చరికలు జారీ చేయడంతో.. మళ్లీ మెడ్‌టెక్ జోన్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్ల నుంచి అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఒక్క పరిశ్రమ రాలేదు. కానీ కొన్ని పరిశ్రమలు వెళ్లిపోయాయని పరిశ్రమల మంత్రి గౌతం రెడ్డే గతంలో ప్రకటించారు. అలా శీతకన్నేసిన మెడ్‌టెక్ జోన్ వల్లే సీఎం జగన్‌కు ఇప్పుడు మంచి పేరు రావడం కొసమెరుపు.