ప్రభాస్ కెరీర్లో ఓ మంచి చిత్రం `మిస్టర్ పర్ఫెక్ట్`. ఈ సినిమా విడుదలై.. నేటితో పదేళ్లు. ఈ సినిమాతో మరో నటుడి కెరీర్‌కు క్లాప్ పడింది. ఆ నటుడే సత్యదేవ్. మిస్టర్ పర్ఫెక్ట్ లోని ప్రభాస్ స్నేహితులలో ఒకడిగా కనిపించాడు సత్యదేవ్. జస్ట్ నాలుగైదు డైలాగులు ఉంటాయంతే. ఆ సినిమాలో సత్యదేవ్ ఉన్నాడన్న సంగతి కూడా ఎవ్వరూ గుర్తు పెట్టుకోలేరు. అంత చిన్న పాత్ర అది. మరి ఇప్పుడూ.. సత్యదేవ్ టాలీవుడ్ లో అత్యంత బిజీగా ఉంటున్న యువ హీరో. తన చేతిలో ఆరు సినిమాలున్నాయిప్పుడు. `బ్లఫ్ మాస్టర్`, `ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య` లాంటి హిట్లు తన ఖాతాలో ఉన్నాయి. నటుడిగా ఒక్కో సినిమాకీ ఎదుగుతున్నాడు సత్యదేవ్. తన అత్యంత సహజ సిద్ధమైన నటనతో `మిస్టర్ పర్ఫెక్ట్` అనిపించుకున్నాడు.
మెగాస్టార్ అభిమానిగా ఇండ్రస్ట్రీకి వచ్చి, ఇప్పుడు చిరంజీవి సినిమాలోనే.. ఓ ఛాన్స్ కొట్టేశాడు. `బ్లఫ్ మాస్టర్` చూసి… సత్యదేవ్ ని ప్రత్యేకంగా ఇంటికి పిలిపించి, అభినందించాడు చిరు. అంతకంటే సత్యదేవ్ కోరుకునే గుర్తింపు ఏముంటుంది? కెరీర్ ఆరంభంలో జూనియర్ ఆర్టిస్టు తరహా వేషాలేసి, ఆ తరవాత స్టార్లుగా ఎదిగినవాళ్లు ఎంతోమంది ఉన్నారు. అందులో సత్యదేవ్ కూడా ఒకడు. పదేళ్ల కెరీర్ పూర్తయిన సందర్భంగా సత్యదేవ్ పాత జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నాడు. మిస్టర్ పర్ఫెక్ట్ తో నటుడిగా తన కెరీర్ మొదలైందని, ఈ ప్రయాణంలో తనకు తోడ్పడిన వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నాడు సత్యదేవ్.