కమల్ హాసన్ – శంకర్ ల సినిమా `ఇండియన్ 2` వివాదాల్లో ఉన్న సంగతి తెలిసిందే. వివిధ కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దాంతో `ఇండియన్ 2`ని పక్కన పెట్టి, మరో రెండు సినిమాల పనుల్ని మొదలెట్టాడు శంకర్. ఈ విషయమై `ఇండియన్ 2` నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.. కోర్టు కెక్కింది. `ఇండియన్ 2` పూర్తి కాకుండా మరో సినిమా మొదలెట్టకుండా తీర్పు ఇవ్వాలని మద్రాస్ కోర్టుని కోరింది. దీనిపై న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది. `ఈ విషయాన్ని మీరే పరిష్కరించుకోండి` అని తేల్చింది. తదుపరి తీర్పుని ఈనెల 28కి వాయిదా వేసింది. దాంతో బంతి మళ్లీ నిర్మాత – దర్శకుడి మధ్య ఆగినట్టైంది.
ఇది వరకే శంకర్ – లైకాల మధ్య చాలా చర్చలు జరిగాయి. వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి కమల్ చాలా ప్రయత్నించాడు. కానీ అవేమీ ఫలితాల్ని ఇవ్వలేకపోయాయి. శంకర్ ఇప్పటికీ `ఇండియన్ 2` పూర్తి చేస్తాననే చెబుతున్నాడు. మరో 20 శాతం చిత్రీకరణ మాత్రమే బాకీ ఉందని, త్వరలో ఆ భాగాన్ని పూర్తి చేస్తానని కోర్టుకు తెలిపాడు. ఇప్పుడు నిర్మాతలే ముందుకు రావాలి. ఈ సినిమాకి ప్రధాన మైన సమస్య బడ్జెట్. ఆ సినిమాకి అనుకున్న బడ్జెట్ ఎప్పుడో దాటిపోయింది. ఇప్పుడు నిర్మాతలు ఒక్క రూపాయి కూడా ఈ సినిమాపై ఖర్చు పెట్టడానికి సిద్ధంగా లేరు. ముందు అనుకున్న ఎగ్రిమెంట్ ప్రకారం… ఈ సినిమాని పూర్తి చేసే బాధ్యత దర్శకుడిదే అన్నది వాళ్ల వాదన. దీనిపైనే కోర్టు తన తదుపరి తీర్పు చెప్పబోతోంది.