వ్యాక్సిన్ విధానంపై దేశవ్యాప్తంగా దుమారం రేగడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే వ్యాక్సిన్లన్నీ ఉచితమేనని ప్రకటించింది. కేంద్రమే… వ్యాక్సిన్ సంస్థల నుంచి రూ. నూటయాభైకి ఒక్కో డోస్ కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపిస్తుందని.. అవన్నీ ఉచితమేనని.. స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా వస్తున్న విమర్శల నేపధ్యంలో ఈ వివరణ ఇస్తున్నట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. దీని ప్రకారం.. పద్దెనిమిదేళ్లు పైబడిన వారికి.. కేంద్రం నుంచి వచ్చే వ్యాక్సిన్లు ఇస్తే… అది ఉచితమే. ఇప్పటికే అనేక రాష్ట్రాల ప్రభుత్వాలు… తమ తమ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్ విధానాన్ని ప్రకటించాయి. దీంతో కేంద్రం వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది.
అయితే కేంద్ర ప్రభుత్వం ఇక్కడో చిట్కా పాటిస్తోంది. అదేమిటంటే… వ్యాక్సిన్ తయారీ సంస్థలు ఉత్పత్తి అయిన వ్యాక్సిన్లు మొత్తం తమకే ఇవ్వాలని కోరడంలేదు. సగం ఇస్తే చాలని అంటోంది. ఉత్పత్తి చేసిన వాటిలో సగం కేంద్రానికి ఇచ్చి.. సగం కంపెనీలు అమ్ముకుంటాయి. ఎంత రేటుకు అమ్ముకుంటాయన్నది తర్వాత విషయం… కానీ.. ఆ అమ్మకాలు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వాలకే చేయాలి. ప్రజలకు టీకాలు వేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ బాధ్యతగా తీసుకున్నాయి కాబట్టి.. కంపెనీల వద్ద రాష్ట్ర ప్రభుత్వాల వద్ద కొనుగోలు చేయాలి. కేంద్రం… సరిపడా వ్యాక్సిన్లు పంపిణీ చేయడం అసాధ్యం. ఇప్పటికే ఒక్క డోస్ వ్యాక్సిన్ ఇచ్చిన వారికి రెండో డోస్ పంపిణీ చేయడం చాలా ఆలస్యం అవుతోంది.
అలాగే కొంత మంది ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడకుండా.. సొంతంగా వ్యాక్సిన్లు వేయించుకోవాలని అనుకుంటారు. అలాంటి వారు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తారు. అలాంటి వారికి ఉచితం కాదు. పెద్ద మొత్తంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతిమంగా చూస్తే… ధరల్లో పెద్దగా మార్పు లేదు. కేంద్రం వ్యాక్సిన్ విధానంలోనూ మార్పు లేదు. కానీ ఉచితంగా ఇస్తున్నామని ట్వీట్ ద్వారా.. వస్తున్న విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం మాత్రం చేసుకున్నారని అర్థమవుతుంది.