ప్రతిష్టాత్మక వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ ను నోవాక్ జోకోవిక్ నిలబెట్టుకున్నాడు. నిరుటి విజేత మళ్లీ విజయనాదం చేశాడు. ఫైనల్లో స్విస్ అందగాడు రోజర్ ఫెదరర్ ను చిత్తు చేశాడు. వింబుల్డన్ లో మూడో టైటిల్ గెలవాలనుకున్న ఫెదరర్ కలను కల్ల చేశాడు. తాను అదే మూడో టైటిల్ ను సాధించి సంచలనం సృష్టించాడు.
ఇద్దరు దిగ్గజాల మధ్య పోటాపోటీగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో జోకోవిక్ జోరుకు ఫెదరర్ తలవంచాడు. 7-6, 6-7, 6-4, 6-3 స్కోరుతో డిఫెండింగ్ చాంపియన్ మళ్లీ టైటిల్ ను గెల్చుకున్నాడు. మొదటి సెట్లో హోరాహోరీగా పోరాడిన ఫెదరర్, రెండో సెట్ గెల్చుకుని ప్రత్యర్థికి చెమటలు పట్టించాడు. ఇక పూర్తి ఫామ్ లోకి వస్తాడని అభిమానులు ఆశగా ఎదురు చూశాడు. మూడోసెట్ కు వచ్చే సరికి జోకోవిక్ జోరు పెరిగింది. ఫెదరర్ పట్టు తగ్గింది. పోరాటపటిమ సన్నగిల్లడంతో ఆ సెట్ ను జోకోవిక్ కు సునాయాసంగా అప్పగించాడు. 6-4తో జోకో విక్ సెట్ సొంతం చేసుకున్నాడు.
కీలకమైన నాలుగో సెట్లో జోకోవిక్ మరింత పట్టుబిగించాడు . చెలరేగి ఆడాడు. అలసట అనేదే తెలియనంతగా పట్టుదలగా ఆడాడు. చావో రేవో అన్నంత కసిగా ఆడి అవలీలగా నెగ్గాడు. అంతటి కీలకమైన సెట్ ను జోకోవిక్ 6-3తో అవలీలగా నెగ్గాడంటే, 33 ఏళ్ల ఫెదరర్ చివర్లో ఎలా చేతులెత్తేశాడో అర్థమవుతుంది. ఆట కీలక దశలో ఆత్మ విశ్వాసం కోల్పోవడం ఫెదరర్ ను దెబ్బతీసింది. రెట్టించిన ఆత్మ విశ్వాసంతో దూకుడుగా ఆడిన జోకోవిక్ తన టైటిల్ ను నిలబెట్టుకుని సగర్వంగా వింబుల్డన్ టూర్ ముగించాడు. ప్రపంచ నెంబర్ వన్ జోకోవిక్, తనకు ప్రస్తుతం ఎదురు లేదని మరోసారి చాటిచెప్పాడు.