టాలీవుడ్ లో కింగ్ మేకర్ దిల్ రాజు. తన ప్రాజెక్ట్ అంటే… అమాంతం హైప్ వచ్చేస్తోంది. దిల్ రాజు ప్రొడక్షన్ అంటే.. హీరోలు సైతం రిలాక్స్ అయిపోతారు. దాదాపుగా స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసేశాడు దిల్ రాజు. పవన్ కల్యాణ్ తో సినిమా చేయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్. అదీ అయిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ హీరోలందరితోనూ… చెరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రభాస్, మహేష్. అల్లు అర్జున్ వీళ్లందరితోనూ సినిమాలు చేసిన దిల్ రాజు, మళ్లీ వీళ్లతో తలో ఓ సినిమా చేయడానికి స్కెచ్ వేస్తున్నాడు. 2021లోనే వీళ్లతో సినిమాల్ని అధికారికంగా ప్రకటించేయాలన్నది రాజు ప్లాన్.
ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో `సలార్` రెడీ అవుతోంది. ఆ తరవాత.. మళ్లీ ఈ కాంబినేషన్లో ఓ సినిమా సెట్ చేయాలన్నది దిల్ రాజు ఆలోచన. మహేష్ – వంశీ పైడిపల్లితో అనుకున్న సినిమా ఆగిపోయింది. అయితే ఈ కాంబోని ఎలాగైనా సరే, పట్టాలెక్కించాలనుకుంటున్నాడట. అలానే అల్లు అర్జున్ తో ఐకాన్ ఎలానూ ఉంది. ఒకవేళ `ఐకాన్` కాకపోయినా… వకీల్ సాబ్ తో హిట్టిచ్చిన వేణు శ్రీరామ్ – బన్నీ కాంబినేషన్ ని మరో కథతో అయినా ఓకే చేయించాలని చూస్తున్నాడు. ఈ కాంబినేషన్ కి సంబంధించిన ఎనౌన్స్మెంట్లన్నీ ఈ యేడాదే ఉండబోతున్నాయి. కాకపోతే.. టైమ్ కుదరాలంతే. మరోవైపు చరణ్ – శంకర్ లతో… ఓ భారీ ప్రాజెక్టు చేయబోతున్నాడు దిల్ రాజు. చూస్తుంటే 2021 ఎవరికి ఎలా ఉన్నా, దిల్ రాజు ని మాత్రం ఫుల్ బిజీ చేయబోతోందన్న విషయం అర్థమౌతోంది.