పదో తరగతి పరీక్షల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసరమైన పట్టుదలకు పోతోంది. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలను నిర్వహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల మరియు వారి తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ పిచ్చి నిర్ణయం విద్యార్థుల మరియు వారి కుటుంబాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లుగా ఉందంటూ ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పరీక్షలు రద్దు:
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. ప్రపంచ దేశాలన్నింటి కంటే భారతదేశంలో కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. దేశంలో పలుచోట్ల ఆస్పత్రులలో ఐ సి యు బెడ్స్ కొరత తీవ్రంగా ఉంది. ఆక్సిజన్ సిలిండర్స్ కొరత తీవ్రంగా ఉంది. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో పాలకుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో, సీబీఎస్సీ సహా అనేక రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు గా ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటించాయి. ఉత్తర ప్రదేశ్ మహారాష్ట్ర పంజాబ్ హర్యానా జార్ఖండ్ ఛత్తీస్ ఘడ్, తెలంగాణ , ఒడిశా సహా మరి కొన్ని రాష్ట్రాలు పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లుగా ప్రకటించాయి. అయితే ఊరందరిదీ ఒక దారైతే ఉలిపిరి కట్టది మరొక దారి అన్న చందంగా ఆంధ్రప్రదేశ్లోని జగన్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల నిర్వహణకు మొగ్గుచూపడం రాష్ట్రంలో తీవ్ర విమర్శలకు తావు ఇస్తోంది.
పరీక్షల నిర్వహణకు మొగ్గుచూపుతున్న జగన్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్లో పరీక్షల నిర్వహణ విషయంలో, పాలకుల నుంచి ఏ ప్రకటన రాకపోవడంతో గత కొంతకాలంగా అనిశ్చితి నెలకొని ఉంది. అయితే ఈ అనిశ్చితికి తెర దించుతూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇవాళ ప్రకటన చేశారు. ఆరోగ్యం, వైద్యం ఎంత అవసరమో ప్రజలకు విద్య కూడా అంతే అవసరం అంటూ ఆయన ఉద్బోధించారు. పదో తరగతి పరీక్షల విషయంలో 11 సబ్జెక్టుల పరీక్షల స్థానంలో వాటిని 7 పరీక్షలకు కుదించి పరీక్షలు నిర్వహిస్తామని ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
పేరెంట్స్ మరియు విపక్షాల నుండి తీవ్ర విమర్శలు:
విద్యాశాఖ మంత్రి ప్రకటన తర్వాత పేరెంట్స్ నుండే కాకుండా, విపక్షాల నుండి కూడా పరీక్షల నిర్వహణ విషయంలో జగన్ ప్రభుత్వం తీరుపై విమర్శలు వస్తున్నాయి. తెలుగుదేశం నేత లోకేష్ మాట్లాడుతూ, తిరుపతిలో ఎంపీ ఎన్నికల సందర్భం గా జగన్ పాల్గొన వలసిన బహిరంగ సభను ఆయన ఇదే కరోనా వైరస్ కారణంగా రద్దు చేసుకున్నాడని, తనకు ఒక న్యాయం విద్యార్థులకు ఒక న్యాయం ఎందుకని, తనవి మాత్రమే ప్రాణాలు , విద్యార్థులవి ప్రాణాలు కాదు అన్నట్లు జగన్ వ్యవహరిస్తున్నారు అని, లక్షలాది మంది విద్యార్థుల మరియు వారి కుటుంబాల ప్రాణాలతో జగన్ చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు రద్దు చేయకపోతే న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని పరీక్షలు రద్దు చేయమని లేఖ రాశారు.
విమర్శల కారణంగా కాస్త వెనక్కి తగ్గిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం:
అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై పేరెంట్స్ కూడా తీవ్రంగా మండిపడ్డారు. పరీక్షల నిర్వహణ ద్వారా విద్యార్థులు వైరస్ క్యారియర్స్ గా మారే ప్రమాదం ఉందని వాపోయారు. పరీక్షల కంటే ప్రాణాలు ముఖ్యమంటూ తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు టీవీ డిబేట్స్ లో కొంత వెనక్కి తగ్గారు. విద్యాశాఖ మంత్రి ప్రకటన తుది నిర్ణయం కాదని, దీనిపై మరింత లోతుగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని, విపక్షాలు దీన్ని రాజకీయం చేయవద్దని వైఎస్ఆర్ సీపీ నేతలు వ్యాఖ్యానించారు
విద్యార్థులు మరియు తల్లిదండ్రుల లో కొనసాగుతున్న అనిశ్ఛితి:
ఒకవైపు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పరీక్షల నిర్వహణ ఉంటుందని వ్యాఖ్యానించగా, విద్యార్థులు మరియు వారి పేరెంట్స్ నుండి వస్తున్న విమర్శలు, విజ్ఞప్తుల దృష్ట్యా వైఎస్ఆర్ సీపీ నేతలు- ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ప్రకటిస్తున్నారు. ఈ రెండు వ్యాఖ్యల్లో ఉన్న విరుద్ధత కారణంగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల లో పరీక్షల విషయంలో ప్రస్తుతం అయోమయం నెలకొంది ఉంది.
అయితే పదోతరగతి విషయంలో ఇంకాస్త సమయం ఉన్నప్పటికీ, ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో వ్యవధి తక్కువగా ఉన్నందున ప్రభుత్వ నిర్ణయాన్ని వీలైనంత త్వరగా ప్రకటించాలని ఇంటర్మీడియెట్ విద్యార్థులు వారి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం పరీక్షలను రద్దు చేస్తుందా లేక తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు మొండిగా ముందుకు వెళ్లి వారి జీవితాలతో చెలగాటం ఆడుతుందా అన్నది వేచి చూడాలి.