ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని ప్రకటించింది. అందుకు రూ. పదహారు వందల కోట్లు ఖర్చు చేయబోతున్నామని కూడా చెప్పుకుంది. అంతే.. ఆ తర్వాత మరో సీన్ ప్రారంభమయింది. ప్రభుత్వ ప్రయత్నానికి మద్దతిస్తామంటూ కొంత మంది విరాళాల చెక్కులతో ముందుకు వచ్చారు. మంత్రి కన్నబాబు.. తూర్పుగోదావరి జిల్లాలో వ్యాపారస్తులు ఇచ్చిన రూ. కోటిన్నర వరకూ చెక్కుల విరాళాలను ముఖ్యమంత్రికి అందించి.. ఇక మీరే మిగిలిపోయారన్న సందేశాన్ని .. కొన్ని వర్గాల మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎంపీ బాలశౌరి రంగంలోకి దిగారు. ఆయన రూ. ఇరవై లక్షలు ఉచిత వ్యాక్సిన్ల పథకానికి విరాళంగా ఇస్తున్నట్లుగా ప్రకటించుకున్నారు. వ్యాపారస్తులకు సందేశం ఇచ్చేందుకు కన్నబాబు… ప్రజాప్రతినిధులకు సందేశం ఇచ్చేందుకు బాలశౌరి విరాళాలు ప్రకటించారు.
ఇక అధికారులకూ మినహాయిపు లేదని .. వారు కూడా ముందుకు రావాలని చెప్పడానికి సునీల్ కుమార్ అనే పోలీసు ఆఫీసర్ ముందుకొచ్చారు. తన ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ సునీల్ కుమార్ ఇప్పుడు సీఐడీ మొత్తాన్ని తన చేతుల్లో ఉంచుకుని తిప్పుతున్నారు. ఇలా అన్ని వర్గాలకూ విరాళాలు అందించాలనే సందేశం పంపించారు. ఇప్పుడు.. రోజూ ఇక.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి విరాళాలు అందించే వారి స్థాయిని బట్టి… అపాయింట్మెంట్ ఇచ్చి.. వారితో ఫోటోలు దిగే కార్యక్రమాన్ని పెట్టుకునే అవకాశం ఉంది. గత ఏడాది లాక్ డౌన్ కారణంగా … కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ పేరుతో విరాళాలు వసూలు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఎలాంటి విభాగాలు పెట్టకపోయినా.. సీఎం సహాయనిధికి .. కోట్ల కొద్దీ విరాళాలు సేకరించాయి. ఏపీలో అయితే ఇది మరీ ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే… ప్రజాప్రతినిధులకు టార్గెట్లు పెట్టి మరీ విరాళాలు సేకరించమని ఆదేశాలు వెళ్లాయని అంటున్నారు. నియోజకవర్గానికి రూ. కోటి కన్నా ఎక్కువగానే ఎమ్మెల్యేలు విరాళాలు సేకరించి.. చెక్కులను ముఖ్యమంత్రికి అందించారు. ఆ సమయంలో.. ఎంపీ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్లు.. కష్టాల్లో ఉన్న ప్రజలను మరింత ఇబ్బంది పెట్టడం ఎందుకని విమర్శలు కూడా చేశారు. సాధారణ ప్రజలు మాత్రమే కాదు.. పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు కూడా కోట్ల కొద్దీ సీఎంఆర్ఎఫ్కు విరాళాలిచ్చారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టు అంచనాల్ని దాదాపుగా రూ. మూడు వేల కోట్ల వరకూ పెంచుకున్న మేఘా కృష్ణారెడ్డి వంటి వాళ్లు లాక్ డౌన్ టైంలో ప్రత్యేక విమానంలో వచ్చి రూ. ఐదు కోట్ల వరకూ చెక్కులిచ్చిపోయారు.
ఇప్పుడు కూడా ఉచిత వ్యాక్సిన్ల కోసం అలాంటి విరాళాల సేకరణ ప్రక్రియ ప్రారంభమవడం ఖాయంగా కనిపిస్తోంది. కొసమెరుపేమిటంటే.. సీఎంఆర్ఎఫ్ ఖాతాలకు ఎంత మేర కోవిడ్ పై పోరాటానికి విరాళాలు వచ్చాయో వివరాలు లేవు. కానీ.. దొంగ చెక్కులు పెట్టి వందల కోట్లు డ్రా చేసుకునేందుకు చేసిన ఓ నేరం మాత్రం బయటపడింది. పక్కా సాంకేతిక సాక్ష్యాలతో ఉండే ఇలాంటి నేరాల్లోని నిందితుల్ని కూడా పోలీసులు ఇంత వరకూ పట్టుకోలేకపోయారు. ఆ కేసేమయిందో ఎవరికీ తెలియదు.