కరోనా .. గిరోనా జాన్తా నైట్.. హిట్ లిస్ట్‌లో ఉన్న వారి ఆస్తులు.. అంతస్తుల సంగతి చూసే వరకూ ఏపీ సర్కార్ పెద్దలు నిద్రపోయేలా లేరు. ఈ వారాంతంలో ఆ చాన్స్ విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఇచ్చారు. ఆయనకు సంబంధించి గాజువాకలో ఓ భవనం ఉంది. దానికి అనుమతులు లేవంటూ.. తెల్లవారుజామునే జేసీబీలతో అధికారులు విరుచుకుపడ్డారు. కూల్చివేయడం ప్రారంభించారు. కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు కదా.. అని అనుకున్న పల్లాకు ప్రభుత్వ అధికారుల తీరుతో … షాక్ తగిలినట్లయింది. వెంటనే ఆయన భవనం వద్దకు వెళ్తే… అక్కడ ఉండకూడదని బలవంతంగా పంపేసి.. ఆయన భవనాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చేస్తున్నారు.
పల్లా శ్రీనివాసరావు విశాఖ ఉక్కు ఉద్యమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన గాజువాక మాజీ ఎమ్మెల్యే. ఆయనను వైసీపీలో చేరాలని ఒత్తిడి చేశారు. గ్రేటర్ మేయర్ పీఠం ఇస్తామని కబురు పంపినా ఆయన రిజెక్ట్ చేశారు. టీడీపీలోనే ఉండి పోరాడుతున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ విశాఖ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదట ఆయననే టార్గెట్ చేసుకున్నారని.. టీడీపీ నేతలు మండి పడుతున్నారు. కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేత ఏమిటని ప్రశ్నించిన వారికి… నోటీసులు ఇచ్చామనే సమాధానమే జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట…ఆంధ్రజ్యోతి ప్రింటింగ్ ప్రెస్ ఉన్న గోడౌన్లను కూల్చివేశారు.
విశాఖలో కరోనా పరిస్థితి తీవ్రంగా ఉంది. ఆస్పత్రుల ముందు.. పెద్ద ఎత్తున రోగులు ఉంటున్నారు. ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడింది.స్టీల్ ప్లాంట్ ఉండి.. పెద్ద ఎత్తున ఆక్సిజన్‌ను దేశ అవసరాలకు ఇస్తున్న స్టీల్ ప్లాంట్ చెంతనే ఉన్నా.. కావాల్సినంత ఆక్సిజన్ తెచ్చుకోవడానికి ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. కరోనా కట్టడి విషయంలో…ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నా.. వాటిని పట్టించుకోకుండా.. టీడీపీ నేతల ఆస్తుల ధ్వంసం ఎజెండాగా ముందుకెళ్తున్నారు. అరెస్టులు చేసి.. వారిని మానసికంగా టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.