ఓ తెలుగు వ్యక్తి చీఫ్ జస్టిస్ అయ్యారు. స్వతంత్ర భారతావనిలో ఈ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా జస్టిస్ ఎన్.వి.రమణ కీర్తి గడించారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఈ కల సాకారం అయింది. ఆయన స్వగ్రామం నుంచి అన్ని ఏపీ , తెలంగాణ మొత్తం ఓ రకమైన భావోద్వేగం కనిపించింది. అందరూ గొప్ప రోజుగా భావించారు. ఆ పరిస్థితి మీడియాలోనూ కనిపించింది. పెద్ద ఎత్తున మీడియాలో జస్టిస్ ఎన్వీ రమణ సమర్థతను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ కథనాలు వచ్చాయి. ఆదివారం నాటి దినపత్రికల్లోనూ ఆ ట్రెండ్ కనిపించింది.
తెలుగువారు ఎక్కడైనా ఉన్నత స్థితికి వెళ్లారంటే.. వారిని విపరీతంగా పొగడటానికి ఏ మాత్రం సంకోచించని ఈనాడు దినపత్రిక.. ఎన్వీ రమణకు విపరీతమైన కవరేజీ ఇచ్చింది. ఆదివారం స్పెషల్ బుక్‌లో..ఆయనపై కవర్ పేజీ ఆర్టికల్ రాసింది. ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఆ స్థాయిలో కాకపోయినా.. తన రేంజ్లో మంచి కవరేజీ ఇచ్చింది. తెలుగు వ్యక్తి కాబట్టి.. తెలుగు పత్రికలు ఇంతగా స్పందించాయని అనుకోవచ్చు. ఏపీకి సంబంధించి ఇంగ్లిష్ ఎడిషన్ పత్రికలు కూడా.. జస్టిస్ ఎన్.వి.రమణ ప్రస్థానాన్ని ప్రత్యేకంగా చెప్పడానికి ప్రాధాన్యత ఇచ్చాయి.అయితే ఒక్క సాక్షిలోనే… ఇవ్వాలి కాబట్టి వార్తను కవర్ చేసినట్లుగా కథనాన్ని రాశారు.
మొదటి పేజీలో ఓ ఫోటో పెట్టి… కొన్ని పాయింట్లను మాత్రమే చెప్పిన సాక్షి.. ఆ తర్వాత వివరణాత్మక కథనంలోనూ ఏమీ రాయలేదు. జస్టిస్ ఎన్.వి.రమణ ప్రమాణస్వీకారం చేశారు.ఫలానా వారు.. ఫలానా వారు హాజరయ్యారు. సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు అన్న వరకే పరిమితం అయింది. కారణం ఏమిటో తెలియదు కానీ.. జస్టిస్ ఎన్విరమణపై జగన్ మీడియా మొదటి నుంచి వ్యతిరేకతతో ఉంది. ఆయన చీఫ్ జస్టిస్ కాకుండా ఉండేలా .. ఆరోపణలు చేస్తూ … లేఖలు రాసి.. నిబంధనలకు విరుద్ధంగా మీడియాకు కూడా విడుదల చేశారు. ఆ కారణంగానే.. ఓ తెలుగు వ్యక్తి చీఫ్ జస్టిస్‌గా ఎదిగినా… కనీసం ఓ మంచి మాట చెప్పలేకపోయారన్న అభిప్రాయం వినిపిస్తోంది.
తెలుగువారు ఎదగకుండా తెలుగువారే కుట్రలు చేసుకుంటారనే .. ఓ నానుడి ఉంది. అది .. గ్రామం అయినా… దేశం అయినా.. ప్రపంచం అయినా.. ఎక్కడైనా తెలుగు వారికి తెలుగువారే శత్రువు. ఒకరు పైకి వెళ్తూంటే.. మరొకరు కిందకు లాగేందుకుప్రయత్నిస్తూంంటారు. సినిమాల్లోనే కాదు.. అనేక చోట్లా.. చాలా సెటైరికల్‌గా ఇలాంటి విషయాలను చెబుతూంటే.. నిజమేననని నమ్ముతూ ఉంటాం. ఇప్పుడు జస్టిస్ ఎన్.వి.రమణ విషయంలో జరిగిన.. జరుగుతున్న వ్యవహారాలను చూస్తే అదే కరెక్ట్ అనిపించకమాదనేది సగటు ఆంధ్రుడి మనసులోమాట.