ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ బాధితుల కోసం అర లక్ష బెడ్స్ ఖాళీగా సిద్ధంగా ఉన్నాయిట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న అద్భుతమైన పటిష్టమైన చర్యల కారణంగా 50 వేలకు పైగా పడకలు అందుబాటులోకి ఇప్పటికే వచ్చేశాయట. 3400 పైగా ఐసియు బెడ్స్ కూడా సిద్ధంగా ఉన్నాయట. ఇలా అని చెబుతూ ఇవాళ సాక్షి పత్రిక రాసిన బ్యానర్ కథనం- కోవిడ్ ఆసుపత్రుల బయట ఒక్క బెడ్ దొరికితే చాలని రాత్రింబగళ్ళు ఎదురు చూస్తున్న బాధితుల ముఖం మీద సాక్షి పత్రిక వేసిన cruel joke లా ఉందన్న అభిప్రాయం ఆంధ్రప్రదేశ్ లో వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే..
సాక్షి దినపత్రిక మొదలయినప్పటి నుండి ఆ పత్రిక మీద ఉన్న ప్రధాన ఆరోపణ జగన్ కుటుంబానికి మేలు జరుగుతుంది అంటే అబద్ధాలను నిజమని మభ్యపెట్టడానికి ఆ పత్రిక ఎంత దూరం అయినా వెళుతుంది అన్నదే. రాజకీయపరమైన అంశాల విషయంలో ఇటు వంటివి ప్రజలు కూడా చూసీ చూడనట్లు వదిలేయడం ఎప్పుడో అలవర్చుకున్నారు. ఎవరి పత్రిక వాళ్లకు అనుకూలంగా ఉంటుంది లే అని సరిపెట్టుకుంటూ, జర్నలిజం విలువలు వంటి వాటిని ప్రజలు కూడా పట్టించుకోవడం మానేశారు. కానీ రాజకీయాలకు సంబంధం లేని కోవిడ్ లాంటి అంశాల్లో కూడా సాక్షి పత్రిక గప్పా లు కొట్టుకోవడం ప్రజలకు ఆ పత్రికపై ఏహ్య భావాన్ని కలిగిస్తోంది. గుంటూరు, నెల్లూరు, విశాఖ , విజయవాడ ఇలా ఏ ప్రాంతానికి వెళ్లినా కోవిడ్ చేస్తున్న విలయతాండవం తో ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. 500 రూపాయలకు దొరక వలసిన టాబ్లెట్ ని 10 వేల రూపాయలకు బ్లాక్ లో అమ్ముతున్నారు. ఆక్సిజన్ సిలిండర్ల సంగతి అయితే వేలం పాట ని తలపిస్తోంది. ఒక్క icu bed దొరకనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా నెలకొని ఉంది. ఎవరో ఒకరు డిశ్చార్జ్ అయితే నో లేక చనిపోతే నో తప్ప icu bed దొరకడం లేదు . వినడానికి ఎంతో చేదుగా ఉన్నా ఇది కఠోర వాస్తవం.
పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే, పేషెంట్స్ తాలూకు కుటుంబ సభ్యులు హాహాకారాలు చేయడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంటే, సాక్షి పత్రిక అర లక్షకు పైగా బెడ్స్ ఆంధ్ర ప్రదేశ్ లో అందుబాటులోకి వచ్చాయి అని, ఖాళీ ఉన్నాయ్ అని అంత పచ్చి అబద్ధాన్ని ఏ విధంగా వ్రాసింది అన్నది పాఠకులకు అంతు చిక్కడం లేదు. కనీసం ఇప్పటికయినా ప్రభుత్వం మేల్కొని నిజమైన చర్యలు తీసుకుంటుందా లేక మభ్యపెట్టే సాక్షి కథనాలతో సరిపుచ్చుతుందా అనేది వేచి చూడాలి.