సాధారణంగా భవనాలను మున్సిపల్ అధికారులు ఎందుుకు కూల్చేస్తారు..?. కారణాలు రాజకీయం అయినా… అసలు కారణాలంటూ కొన్ని చూపించారు. అక్రమ భవనం అని.. ప్లాన్ లేదని.. భూమి వివాదంలో ఉందని.. ఇలా.. చాలా ఉంటాయి చెప్పుకోవడానికి. కానీ విశాఖలో టీడీపీ నేతల ఇళ్లు, ఆస్తులు ధ్వంసం చేయడానికి విచిత్రమైన కారణాలు చెబుతున్నారు. టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ కు చెందిన భవనాన్ని ఎందుకు కూల్చివేస్తున్నారంటే… జీవీఎంసీ అధికారులు చెప్పిన కారణం.. భవిష్యత్లో రోడ్డును విస్తరిస్తారట. అందుకని.. సెట్ బ్యాక్స్ వదలకుండా నిర్మాణం చేపడుతున్నారట. అందుకే కూల్చేశారట. .. అబ్బా.. ఇలాంటి కారణాలతో కూడా కూల్చేస్తారా అని ఆశ్చర్యపోయేలా .. అధికారులు చెప్పిన కారణం ఇప్పుడు వైరల్ అవుతోంది.
పల్లా శ్రీనివాస్ కుటుంబం 1976లో కొంత స్థలం కొనుగోలు చేసింది. ఆ స్థలంలో ఉన్న పాత నిర్మాణం స్ధానంలో కొత్తగా జి ప్లస్ 4 నిర్మాణం ప్రారంభించారు. నిబంధనల ప్రకారం ప్లాన్ అప్రూవల్ కూడా తీసుకున్నారు. మూడో అంతస్తు శ్లాబ్ నిర్మించారు. నాలుగో అంతస్తు ఇంకా వేయలేదు. ఈ లోపే జేసీబీలతో జీవీఎంసీ అధికారులు తెల్లవారక ముందే వచ్చి పడ్డారు. మాస్టర్ ప్లాన్ లో 200 అడుగుల రోడ్డు వస్తుందని దానికి సెట్ బ్యాక్స్ వదల లేదని అందుకే కూల్చేస్తున్నామని ప్రకటించేశారు. యజమాని పల్లా శ్రీనివాస్ వచ్చే సరికి సగం కూల్చేశారు.
ప్లాన్ అప్రూవల్ లో వున్న నిబంధనల ప్రకారం 6 నుంచి 7 మీటర్లు వదిలి పెట్టామని పల్లా శ్రీనివాస్ అధికారులకు చూపించారు. రోడ్డు విస్తరణకు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాంటప్పుడు.. తమ నిర్మాణం ఉల్లంఘన ఎలా అవుతుందని ఆయన ప్రశ్నిస్తే ప్రయోజనం లేకుండా పోయింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వరా అని అంటే.. పోలీసుల్ని పెట్టి అక్కడ్నుంచి పంపించేశారు. మొత్తానికి టీడీపీ నేతల ఆర్థిక పునాదుల్ని కూల్చివేయాలనుకున్నారు.. కూల్చేస్తున్నారు. దానికి రూల్స్ గట్రా .. ఏమీ ఉండవు. నేరమనస్థత్వం ఉన్న వారి చేతిలో అధికారం ఉంటే… ప్రజల ఆస్తులు ఇలాగే విధ్వంసం అవుతాయని టీడీపీ నేతలు మండి పడుతున్నారు.