జాతీయ విపత్తు కంటే మహా ఉపద్రవం ఇప్పుడు దేశంలో అల్లకల్లోలం రేపుతోంది. ఇలాంటి సమయంలో.. బాధ్యత ఉన్న వారందరూ కలసికట్టుగా పోరాడి ప్రజల్ని కాపాడాలి. అన్నికంటే ముఖ్యంగా… దేశాన్ని పరిపాలిస్తున్న వారికి ఉంటుంది. రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకుని… పరిపాలన చేస్తున్న కేంద్రంపై ఉంటుంది. సువిశాల దృష్టితో ఆలోచించి.. ప్రజలందర్నీ ఒకే రకంగా చూసి.. ప్రాణాలు కాపాడాల్సి ఉంటుంది. కానీ… ఘనత వహించిన భారత ప్రభుత్వం ఒక్క గుజరాత్‌కు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. మిగతా రాష్ట్రాల పట్ల చిన్న చూపు చూస్తోంది. చివరికి ఉచిత వ్యాక్సిన్ల విషయంలోనూ… రాష్ట్రాలకు గడ్డు పరిస్థితి తెచ్చి పెట్టింది.
రాష్ట్రాలకు ఇప్పటి వరకూ కేంద్రం ఉచితంగానే టీకాలు పంపిణీ చేసింది. టీకాలు ప్రజలందరికీ ఉచితంగానే ఇస్తామని గతంలో ప్రకటనలు చేసింది. తీరా ఇవ్వాల్సి వచ్చే టప్పటికీ.. పరిస్థితి మారిపోయింది. రాష్ట్రాలు ఇచ్చుకోవాలన్నట్లుగా తేల్చేసింది. ప్రజలను కష్టపెట్టలేక దేశంలోని అన్ని రాష్ట్రాలు.. తమ ప్రజలకు ఉచితంగా టీకాలు ఇస్తామని ప్రకటించాయి. ఒకదానితర్వాత ఒకటి ఇలా రాష్ట్రాలు ప్రకటిస్తూ పోతున్నాయి. ఇలా ప్రకటించినప్పుడల్లా.. అందరూ కేంద్రం వైపు చూస్తున్నారు. రాష్ట్రాలే ఇస్తున్నప్పుడు.. కేంద్రం ఎందుకు ఇవ్వలేకపోతోందని.. బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని… ఆ చూపుల సారంశం.
టీకాల కోసం ఒక్కో రాష్ట్రం దాదాపుగా రూ. రెండు వేల కోట్ల వరకూ ఖర్చు చేయాల్సి రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో … రాష్ట్రాల ఆదాయాలనుపరిమితం చేసి.. కేంద్రం సెస్సుల రూపంలో వసూలు చేసిన మొత్తంలో కొంత భాగాన్ని వ్యాక్సిన్ల కోసం కేటాయించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిజానికి బడ్జెట్లో వ్యాక్సిన్ కోసం కేంద్రం రూ. 36వేల కోట్లనుకేటాయించింది. ఆ నిధులన్నీ ఎలా కేటాయిస్తారో తెలియదు కానీ.. అవి కేటాయిస్తే.. రాష్ట్రాలపై భారం ఉండదు. కానీ కేంద్రం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.
బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలాగూ నోరెత్తలేరు. తమకు ఏం కావాలన్న మోడీ చేస్తారనే ధీమా వారిలో ఉంది. చేయకపోయినా… ఎలక్షన్లలో మోడీ మార్క్ మ్యాజిక్ ఉంటుంది కాబట్టి… తామేమీ ఇబ్బంది పడాల్సిన పని లేదని వారు దిలాసాగా ఉన్నారు. బీజేపీయేతర రాష్ట్రాలు మాత్రం…తమకు న్యాయంగా రావాల్సిన కోటా టీకాలు.. ఆక్సిజన్లు కూడా రావడం లేదని..ఫైరయిపోతున్నాయి. ఇప్పుడు… వ్యాక్సిన్లు కూడా.. కేంద్రం ఇవ్వడం లేదు. పరిమిత ఆదాయ వనరులు ఉన్న రాష్ట్రాలు… ఎలాగైనా .. టీకాలుఇవ్వడానికి ప్రకటనలు చేస్తూంటే… బాధ్యత తీసుకోవాల్సిన కేంద్రం మాత్రం.. నోరు మెదడం లేదు. రాష్ట్రాలు చేస్తున్న ప్రకటనలు కేంద్రానికి ఖచ్చితంగా పరువు తక్కువేనని.. కానీ ఆ విషయం తెలిసినా కేంద్రం తెలియనట్లు ఉంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.