కరోనాకు ప్రెస్ అని చెప్పి.. ఐడీ కార్డు చూపించి తప్పించుకునే వెసులుబాటు జర్నలిస్టులకు కలగలేదు. ఆ మాటకొస్తే కరోనా అందర్నీ సమానంగానే చూస్తోంది. జనంలో తిరిగే వారిని ఇంకా ఎక్కువ సమానంగా చూస్తోంది. ఈ బాధ్యతల్లో ఉన్న జర్నలిస్టులు ఎక్కువగా కరోనాకు చిక్కుతున్నారు. అన్ని మీడియా సంస్థల్లోనూ గత ఏడాది కంటే ఎక్కువగా కరోనా టెర్రర్ కనిపిస్తోంది. ఉద్యోగుల్లో సామూహికంగా కరోనా బారిన మీడియా సంస్థల్లో టీవీ9 ముందు ఉంది. హైదరాబాద్ యూనిట్లో పని చేస్తున్న వారిలో దాదాపుగా యాభై శాతం మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో టీవీ9 కార్పొరేట్ కార్యాలయంలో ఓ ఫ్లోర్ మొత్తాన్ని సీజ్ చేసేశారు. వార్తల్ని కూడా… యాంకర్లు మాస్కులు పెట్టుకునే చదవాలని నిర్ణయించుకున్నారు.
టీవీ9 ఉద్యోగుల్లో కొంత మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఎక్కువ మంది హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. కొంత మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందారు. అయితే.. టీవీ9 యాజమాన్యం కరోనా బారిన పడిన తమ ఉద్యోగుల పట్ల కొంత ఉదారత చూపుతోంది. వైద్య సాయంతో పాటు ఇతర అవసరాలు చూసేందుకు హెచ్ఆర్ టీమ్ ద్వారా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది. కానీ ఇతర సంస్థల్లో ఇలాంటి పరిస్థితి లేదు. అందుకే ఎక్కువ మంది జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారు.
తెలుగు మీడియా పై కరోనా సెకండ్ వేవ్ నిర్ధాక్షిణ్యంగా దాడి చేస్తోంది. ఇప్పటికే ఇరవై మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వందల మంది కరోనా బారిన పడ్డారు. ప్రతీ రోజు.. ఎవరో ఒకరి మరణవార్త వినాల్సిన దుస్థితి ఏర్పడిందని.. ఇతర జర్నలిస్టులు మథనపడుతున్నారు. తమ జీవితాలు ఇలా ఎందుకయ్యాయని వాట్సాప్ గ్రూపుల్లో నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. మీడియాలో పరిస్థితి ఇప్పుడు ఉద్వేగభరితంగా ఉంది. బతికుంటే బలుసాకు తినొచ్చనే పరిస్థితి లేదు. వర్క్ ఫ్రం హోంకు చాన్స్ ఉన్న వారికీ యాజమాన్యాలు చాన్స్ ఇవ్వడం లేదు. ఫలితంగా ఎక్కువగా జర్నలిస్టులే కరోనా దెబ్బకు కుదేలవుతున్నారు.