కలెక్టర్ అవ్వాలంటే .. చిన్నప్పటి నుంచి చదవాలి.. చదవాలి.. చదవాలి. పరీక్షలురాసి పాసవ్వాలి. సివిల్స్ గెలవాలి. ఇన్ని కష్టాలుపడితే.. అతి కొద్ది మంది కలెక్టర్ల వరకూ వస్తారు. ఇంత కష్టం ఎందుకు.. కలెక్టర్ అయిన వారి సంతకాన్ని ప్రాక్టిస్ చేస్తే పోలా …కావాల్సినన్ని డబ్బులు డ్రా చేసుకోవచ్చనుకున్నారు ఓ ముగ్గురు వ్యక్తులు. అదే పనిచేశారు. చివరికి దొరికిపోయారు. కలెక్టర్, మైనింగ్ ఏడీ సంతకాలు ఓ వారం పాటు ప్రాక్టిస్ చేసిన ముగ్గురు వ్యక్తులు… తర్వాత తమ పథకాన్ని అమలు చేసి రెండు కోట్లు కొట్టేయబోయారు. చివరికి దొరికిపోయారు. ఈ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది.
మంచిర్యాల కలెక్టర్ భారతి హోళీ కేరి, మైనింగ్ ఏడి బాలు సంతకాలు ఉన్న ఓ చెక్ బ్యాంకుకు వచ్చింది. వాటి విలువ ఒక కోటి 97 లక్షలు. ఎందుకో బ్యాంక్ అధికారులకు డౌట్ వచ్చింది. వెంటనే.. వారు అధికారులను సంప్రదించారు. దీంతో ఆ చెక్కుల బండారం బయటపడింది. ఆ చెక్కులు నిజంగానే మైనింగ్ డిపార్టుమెంటువే. సంతకాలు కూడా అచ్చు వారు చేసినట్లే ఉన్నాయి. కానీ ఫేక్ అని తేలడంతో పోలీసులు తీగ లాగారు.
మంచిర్యాల మైనింగ్ అధికారులు కొత్త చెక్బుక్కులకు ఐసీఐసీఐ బ్యాంక్‌కు ఆర్డర్ చేస్తే కొరియర్లోనే వస్తాయి. కొరియర్లోనే చెక్ బుక్‌లను కాజేసిన రాజు అనే వ్యక్తి.. తన మిత్రుడైన మేడిపల్లి జీవన్ తో కలిసి ఫోర్జరీ చేయడం ప్రారంభించారు. కలెక్టర్ , మైనింగ్ ఏడి సంతకాలను ఇంటర్నెట్ నుంచి సేకరించి.. ప్రాక్టీస్ చేయించి ఫోర్జరీకి పాల్పడ్డారు. జిల్లా కలెక్టర్ కు సంబంధించిన స్టాంపు తోపాటు మైనింగ్ ఎడి స్టాంపులను తయారుచేయించారు.
డబ్బులు కాజేయడానికి బినామీ పేర్లతో కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఫోన్ నెంబర్ కూడా బినామీ పేరు మీద కొత్తది తీసుకున్నారు. అయితే ప్లాన్ అడ్డం తిరిగింది. చెక్కులు క్లియరన్స్కు వచ్చిన విషయం బ్యాంక్ అధికారులు.. మైనింగ్ అధికారులకు చెప్పడంతో గుట్టు రట్టయింది. దీతో అక్రమార్కులు దొరికిపోయారు. వారిని పట్టుకుని జైలుకు పంపేశారు. సంతకం ప్రాక్టిస్ చేస్తే కలెక్టర్ అయిపోరని.. నేరస్తుడవుతారని.. ఆ తర్వాతే వారికి తెలిసి ఉంటుంది.