ధనాధన్ క్రికెట్ ఐపీఎల్‌పై మళ్లీ కరోనా పడగ నీడ పడుతోంది. ప్రేక్షకుల్ని అనుమతించకుండా… ఆటగాళ్లను బయోబబుల్‌లో పెట్టి మరీ టోర్నీ కొనసాగిస్తున్నప్పటికీ.. ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. కరోనా కేసులు లెక్కకు మిక్కిలిగా పెరిగిపోతూండటంతో పలువురు ఆటగాళ్లు.. టోర్నీ నుంచి వైదొలుగుతున్నారు. భారత ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కుటుంబసభ్యుల్లో ఒకరికి పాజిటివ్‌గా ఖరారైంది. దాంతో కుటుంబానికి సపోర్ట్‌గా ఉండాలన్న లక్ష్యంతో టోర్నీ నుంచి విరమించుకుంటున్నట్లుగా బీసీసీఐకి సమాచారం పంపారు.
బీసీసీఐ కూడా అంగీకారం తెలిపారు. అశ్విన్ తో పాటు విదేశీ ఆటగాళ్లయిన అడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్, అండ్రూ టై కూడా ఐపీఎల్ టోర్నీని వీడి స్వదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆటగాళ్లు అందరూ ఐపీఎల్ ఆడేందుకు భయపడుతున్నారన్న ప్రచారం ప్రారంభమైంది. ఐపీఎల్ నిర్వహణపై పునరాలోచిస్తారేమోనని… చాలా మంది బీసీసీఐ వైపు చూస్తున్నారు. కానీ బీసీసీఐ.. ముందుగానే స్పందించింది. ఎలాంటి స్పెక్యులేషన్‌కు చాన్సివ్వకుండా.. ఎంత మంది ఆటగాళ్లు వెళ్లిపోయినా టోర్నీకి మాత్రం ఇబ్బంది లేదని ప్రకటించారు. వెళ్లే ఆటగాళ్లు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చని కూడా చెబుతోంది. ఇండియాలో కరోనా పరిస్థితి ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది.
క్రికెటర్ల సొంత దేశాలు కూడా.. తమ ఆటగాళ్ల భద్రతపై దృష్టి పెట్టాయి. టోర్నీ నుంచి ఎవరైనా విరమించుకోవాలనుకున్నా.. లేదా టోర్నీ అయిపోయే వరకూ ఉన్నా.. ప్రత్యేక విమానాల్లో తీసుకెళ్లాలని సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఆటగాళ్ల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇప్పటికే ఆయా దేశాలు ఇండియా నుంచి విమానాల రాకపోకలపై నిషేధం విధించాయి. మొత్తానికి కరోనా కల్లోలం ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ.. ఐపీఎల్ మాత్రం కొనసాగుతుందని బీసీసీఐ మరో మాట లేకుండా చెబుతోంది.