కరోనా సెకండ్ వేవ్ భయంతో… ముందే ఆగిపోయిన సినిమా `లవ్ స్టోరీ`. ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన సినిమా ఇది. కరోనాకి భయపడి… వాయిదా వేశారు. కొత్తరిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. అన్నీ కుదిరి. పరిస్థితులు చక్కబడితే.. మేలో రావొచ్చు.
అయితే ఈ వాయిదా సమయాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల చక్కగా వాడుకుంటున్నాడు. `లవ్ స్టోరీ` సెన్సార్ కూడా అయిపోయిన సంగతి తెలిసిందే. రీషూట్లకు అవకాశం లేదు. అయితే.. ఇప్పుడు సినిమాని తీరిగ్గా ట్రిమ్ చేసుకుంటున్నాడు. శేఖర్ కమ్ముల సినిమాలు లెంగ్త్ పరంగా చాలా పెద్దగా ఉంటాయి. సహజత్వం కోసం సుదీర్ఘమైన సన్నివేశాలు తీయడం తన అలవాటు. అయితే ఈ జనరేషన్ మారింది. లెంగ్త్ పెరిగితే, బోర్ ఫీల్ అవుతున్నారు. అందుకే `లవ్ స్టోరీ`ని వీలైనంత ట్రిమ్ చేసే పనిలో పడ్డాడని తెలుస్తోంది. ఇటీవల సినిమా చూసుకున్న శేఖర్ కమ్ముల మరో పది నిమిషాల సినిమాని ట్రిమ్ చేసినట్టు, ఇప్పుడు `లవ్ స్టోరీ` అవుట్ పుట్ మరింత మెరుగైనట్టు సమాచారం. చిన్న చిన్న విషయాలే ఒక్కోసారి సినిమా ఫలితాన్ని తారు మారు చేస్తుంటాయి. వాటిని ముందే గ్రహించి సరి చేసుకుంటే.. అనుకున్న ఫలితం వస్తుంది. కొన్నిసార్లు ఆఘమేఘాల మీద సినిమాల్ని విడుదల చేసుకోవాల్సివచ్చినప్పుడు చిన్న చిన్న కరెక్షన్లు వదిలేయాల్సివస్తుంది. అయితే ఇప్పుడు శేఖర్ కమ్ములకు బోలెడంత సమయం మిగిలివుంది. అందుకే ఆయన ఈ సినిమాని మరింత షార్ప్ గా చెక్కుతున్నాడు.