తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా ఎన్నికల్లో జరిగిన అవకతవకల ఆరొపణలపై విచారణ జరపడానికి బోర్డు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. ప్రస్తుతం తానాలోనే కీలక పదవిలో ఉన్న వ్యక్తి ఒకరు.. మరో కీలక పదవికి పోటీ చేస్తూ… ఓటర్ల లిస్టులో దొంగ ఓటర్లను చొప్పించారు. ఈ కారణంగా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసిన ఎన్నికల కమిటీ.. అత్యవసరంగా బోర్డు సమావేశాన్ని నిర్వహించింది. ఏం చేయాలో చర్చించింది. అంతిమంగా మూడు అంశాలపై తీర్మానాలు చేశారు. అందులో మొదటిది.. తానాలో అత్యంత సీనియర్లు, అందరి ఆమోదం కలిగిన ముగ్గురు గౌరవప్రదమైన వ్యక్తులతో దొంగ ఓట్ల వివాదంపై విచారణ జరిపించాలని నిర్ణయించారు.
ఈ కమిటీలో బండ్ల హనుమయ్య, జంపాల చౌదరి, మురళీ వెన్నం సభ్యులుగా ఉంటారు. వీరు మొత్తం అవకతవకలుజరిగిన విధానం… ఎవరు చేశారు… ఎలా చేశారన్నదానిపై విచారణ జరిపి రెండు వారాల్లో నివేదిక సమర్పిస్తారు. ఈ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. రెండోది ఎన్నికల కమిటీ మరోసారి ఖచ్చితమైన ఓటర్ లిస్టును రెడీ చేసి సమర్పించాలి. మూడోది.. ఏప్రిల్ ముప్ఫయ్యో తేదీలోపు.. సభ్యులందరికీ బ్యాలెంట్లు పంపిణీ చేయాలనే తీర్మానాలు చేశారు. సమావేశానికి ముందే.. నామినేషన్ అండ్ ఎలక్షన్ కమిటీ.. తన నివేదికను బోర్డుకు సమర్పించింది.
అందులో దొంగ ఓటర్ల అవకతవకల గురించి సమగ్రంగా ఉంది. దాంతో విచారణ కమిటీ నియామకం చేయాలని తీర్మానం చేశారు. ప్రవాసాంధ్రులు అత్యధికంగా సభ్యులుగా ఉన్న తానాలో … దొంగ ఓటర్ల జాడ్యం తరహా పరిస్థితులు రావడం.. చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఈ వివాదానికి ఎలాంటి ముగింపు పలుకుతారు.. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటారా.. అన్న చర్చ ఇప్పుడు తానా సభ్యుల్లో నడుస్తోంది.