ప్రశంసించిన నోళ్లు ఇప్పుడు తెగుడుతున్నాయి. గొప్ప పాలకుడు అంటూ కీర్తించిన అక్షరాలు ఇప్పుడు.. ట్రంప్‌తో పోలుస్తూ ఎగతాళి చేస్తున్నాయి. దేశంలో కరోనా పరిస్థితికి కారణంగా .. ప్రధాని నరేంద్రమోడీనేననంటూ అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తి పోస్తోంది. మీడియా ప్రచారానికి అలవాటుపడిపోయిన ప్రధాని దేశ ప్రజల్ని రిస్క్‌లో పెట్టారని.. అమెరికా నుంచి బ్రిటన్ వరకూ ఉన్న ఇంటర్నేషనల్ పత్రికలన్నీ దుమ్మెత్తి పోస్తున్నాయి. కార్టూన్లు వేసి.. ప్రధాని ప్రజలకు చేసిన అన్యాయాన్ని వెల్లడిస్తున్నాయి.
ఎకనమిస్ట్, గార్డియన్ , న్యూయార్క్ టైమ్స్, స్కైన్యూస్ , టైమ్స్ లాంటి అంతర్జాతీయ పత్రికలు.. మోడీ తీరును తీవ్రంగా విమర్శిస్తున్నాయి. పని తక్కువ హడావుడి ఎక్కువ అని గేలిచేస్తున్నాయి. సెకండ్ వేవ్ గురించి నిపుణులు ముందు నుంచీ హెచ్చరిస్తున్నా… ఎన్నికలు , కుంభమేళాలు నిర్వహించి, బడులు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్ తెరచి కరోనా వ్యాప్తికి కారణమయ్యారని తేల్చింది. అంతే కాదు.. భారతీయులకు వైద్య సౌకర్యాలు ఎంత నాసిరకంగా అందిస్తున్నారో కూడా రిపోర్ట్ చేస్తున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క, ఆక్సిజన్ దొరక్క రోగులు కారిడార్లలోనే మరణించడం… శ్మశానాల ఎదుట క్యూలు… అన్నీ ప్రపంచం ముందు పెట్టి.. మోడీని కారణంగా చూపిస్తున్నాయి.
అంతర్జాతీయ మీడియాకు ఇప్పుడు ఇండియాలో సెకండ్ వేవ్ కన్నా పెద్ద వార్త లేదు. ఢిల్లీలోని ఒక ఆస్పత్రి ముందు స్కైన్యూస్ టీవీ లైవ్ కవరేజ్ ఇచ్చింది. తన కళ్లముందే కొద్ది గంటల వ్యవధిలో చికిత్సకోసం ఎదురుచూస్తూ ఆరుగురు మరణించారని ప్రత్యక్షంగా చూపించారు. మోడీ ప్రధానమంత్రి అయ్యాక అంతర్జాతీయ మీడియా నుంచి ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు ఎప్పుడూ రాలేదు. బాధ్యతాయుత పదవుల్లో ఉండి ఏ మాత్రం బాధ్య0త లేకుండా ఎన్నికల సభల్లో పాల్గొనడాన్ని కూడా అంతర్జాతీయ మీడియా ప్రశ్నించింది.
దేశ దుస్థితికి ఇప్పుడు ప్రపంచం మొత్తం జాలి పడుతోంది. తలా కొంతసాయం చేయాలని నిర్ణయించుకున్నాయి. లేకపోతే.. ఇండియా నిర్లక్ష్యం.. తమ దేశాలపై ఎక్కడ ప్రభావం చూపిస్తుందోనని ఆందోళన చెందుతున్నాయి. ఇండియా నుంచి రాకపోకల్ని నిషేధించాయి. దేశ మీడియా.. సోకాల్డ్ దేశ భక్తుల్లో మోడీని తప్పుపట్టడానికి సిద్ధపడరు.. దీనికి ప్రజల్నే నిందిస్తారు. కానీ అంతర్జాతీయ మీడియా.. ఆ టైప్ దశభక్తి ఉండదు.