మే ఒకటో తేదీ నుంచి పద్దెనిమిదేళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ముఖ్యమంత్రి జగన్ ఉత్సాహంగా అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయబోతున్నామని ప్రకటించారు. ఆ వెంటనే భారత్ బయోటెక్ ఎండీతో ఫోన్‌లో మాట్లాడారని.. కావాలంటే డబ్బులు ముందే కడతామని చెప్పారని.. వ్యాక్సిన్లు పంపాలని కోరారని మీడియాకు సమాచారం ఇచ్చారు. ఇంకేముంది.. ఒకటో తేదీ కల్లా కావాల్సినన్ని వ్యాక్సిన్లు వచ్చేస్తాయి… ఇక వేయడమే మిగిలిందని అందరూ అనుకున్నారు. కానీ వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి.. సోమవారం రోజున ఈ గాలంతా తీసేశారు. జూన్ వరకూ పద్దెనిమిదేళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదని ప్రకటించారు.
వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి సింఘాల్ ప్రెస్‌మీట్ పెట్టి.. చాలా విషయాలు చెప్పారు. మిగతా వాటి సంగతేమో కానీ.. ఆయన పద్దెనిమిదేళ్లు నిండిన వారికి ఉన్న పళంగా.. ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఆయన చెప్పిన కారణం సహేతుకంగానే ఉంది. ప్రస్తుతం దేశంలో రెండే సంస్థలు వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయి. ఉత్పత్తి అయిన వాటిలో సగం కేంద్రానికి ఇవ్వాలి. మిగతా సగంకంపెనీలు ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఎవరు ఎక్కువ రేటు ఇస్తే వారికి అమ్ముకుంటాయి కంపెనీలు. రాష్ట్రాలకు అమ్మాలన్న రూలేం లేదు. కేంద్రానికి ఇచ్చే కోటా మాత్రం .. రాష్ట్రాలకు పంపుతారు. అంటే.. అవే దక్కుతాయి. వ్యాక్సిన్ కంపెనీల నుంచి నేరుగా వచ్చే కోటా ఏమైనా ఉంటే వాటి ద్వారా కొంత మందికి టీకాలు వేయవచ్చు.
ఏపీలో నలభై ఐదేళ్ల లోపు వారు రెండు కోట్లపైనే ఉంటారు. వారికి రెండు సార్లు టీకా వేయాలంటే నాలుగు కోట్ల డోసులు కావాలి. అంత ఉత్పత్తి చేసి ఇచ్చేంత పరిస్థితి లేదు. అందుకే.. ఏపీ ప్రజలు ఎక్కువగా ఆశలు పెట్టుకోకుండా.. జూన్ వరకూ… పద్దెనిమిదేళ్లు నిండిన వారికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం లేదని ప్రకటించేసింది. ఇతర రాష్ట్రాలు కూడా.. పెద్ద ఎత్తున వ్యాక్సిన్ల కోసం ప్రయత్నిస్తున్నాయి. అంతర్జాతీయ బిడ్లు వేసి మరీ ప్రజలకు టీకాలు అందించాలని అనుకుంటున్నాయి. మరి ఏపీ సర్కార్ ఆ దిశగా ప్రయత్నిస్తుందా లేక.. కేంద్రం ఇచ్చే వాటిని మాత్రమే పంపిణీచేస్తుందా.. అన్నది వేచి చూడాలి..!