తెలంగాణ రాష్ట్ర సమితికి ఇరవై ఏళ్లు నిండాయి. కేసీఆర్తో చెప్పినట్లుగా ఒక్కరితో నడక ప్రారంభమై… కోట్ల మంది చేరి.. ప్రత్యేక రాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమం టీఆర్ఎస్. రాజకీయ కారణాలో.. చారిత్రక అవసరాలో కానీ.. కేసీఆర్ .. తెలంగాణ రాష్ట్ర సాధన అజెండా పార్టీ పెట్టాలని నిర్ణయించుకుని ఇరవై ఏళ్ల కిందట.. హైదరాబాద్లోని జలదృశ్యంలో ఇదే రోజున పార్టీ ప్రకటన చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ను సిద్ధాంతకర్తగా పెట్టుకుని పోరాటం ప్రారంభించారు. ఆ రోజున కేసీఆర్ వెంట పెద్దగా ఎవరూ లేరు. ఎన్ని ఎదురు దెబ్బలైనా ముందుకే సాగారు.
పార్టీ పెట్టిన మూడేళ్లకు వచ్చిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోఉద్యమ పార్టీ సత్తా చాటింది. కొన్ని జిల్లాల్లో సొంతంగా జడ్పీ చైర్మన్ పదవులను దక్కించుకునే స్థాయికి ఎదిగి.. 2004 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పొత్తు కోసం తన వద్దకు వచ్చేలా ఆకర్షించగలిగింది. 2004లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ 26 అసెంబ్లీ స్థానాలను, 5 పార్లమెంట్ స్థానాలను గెలుచుకోగలిగింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో భాగస్వామిగానూ చేరింది. రాష్ట్రపతి ప్రసంగంలోనూ తెలంగాణ అంశాన్ని పెట్టినా… రాష్ట్రం ఏర్పాటు చేయలేదని చెప్పి.. పదవుల్ని త్యాగం చేసేశారు. ఓ సందర్భంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేసిన ఎత్తులు, వ్యూహాలను తట్టుకోలేక విలవిల లాడింది. ఇక టీఆర్ఎస్ పనైపోయిందన్నట్లుగా వైఎస్.. ఆ పార్టీని దెబ్బకొట్టారు. 2009 ఎన్నికల్లో మహాకూటమిగా పోటీ చేసి 10 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు పరిమితం కావడంతో పరిస్థితి ఇంకా దిగజారింది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కేసీఆర్ వేగంగా తన వ్యూహాలకు పదును పెట్టారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారు. అక్కడ నుంచి తెలంగాణ ఉద్యమం తీవ్రం కావడం టీఆర్ఎస్ కు ఊహించని స్థాయిలో కలిసొచ్చాయి. కేసీఆర్ చేపట్టిన దీక్ష సకల జనులను కదిలించడంతో డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు చేస్తామని కేంద్రం చేసిన ప్రకటన టీఆర్ఎస్ కు కొత్త ఊపు తెచ్చింది. ఆ తర్వాత ఆలస్యం అయినా .. అది టీఆర్ఎస్కు మరింత మేలు చేసింది. ఉద్యమ పార్టీగా.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన పార్టీగా ప్రజల మన్ననలు అందుకుంది.
తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలనలోనూ బంగారు తెలంగాణ దిశగా సాగేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. అప్పట్లో ఉద్యమ పార్టీ అన్న కేసీఆర్.. ఇప్పుడు టీఆర్ఎస్ను ఫక్తు రాజకీ పార్టీగా అభివర్ణిస్తున్నారు. దానికి తగ్గట్లుగా రాజకీయ వ్యూహాలను అమలు ేస్తున్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకునే గులాబీ పార్టీ వరుసగా మూడేళ్ళుగా దానికి దూరంగా ఉంటోంది. పార్లమెంట్ ఎన్నికల కారణంగా 2019లో… కరోనా కారణంగా 2020లో.. పార్టీ ప్లీనరీ ఆవిర్భావ సభను రద్దు చేసుకుంది. దాంతో ఈ యేడాది ద్వి దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించారు టిఆర్ఎస్ నేతలు. కానీ తీరా సమయం దగ్గరకు వచ్చే సరికి కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో వేడుకలు జరపడం లేదు.
ఇరవై ఏళ్ల తర్వాత టీఆర్ఎస్ మరిన్ని సవాళ్లు ఎదుర్కొంటోంది. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే క్రమంలో… కేసీఆర్ దూకుడుగా ఉంటున్నారు. ఎదురు దెబ్బలు తగిలినా టీఆర్ఎస్ ప్రస్థానాన్ని మరింత కాలం కొనసాగించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.