ఒక్కో సినిమాలో ఒక్కోటి నచ్చుతుంది. కొన్ని సినిమాల్లో హీరో పాత్ర బాగుంటుంది. ఇంకొన్ని సినిమాల్లో పాటలు నచ్చుతాయి. మరికొన్ని సినిమాల్లో ఎమోషన్స్, హీరో.. హీరోయిన్ల కెమిస్ట్రీ ఇవి బాగుంటాయి. ఇవన్నీ కట్టకట్టుకుని బాగుంటే… ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ గా మిగులుతుంది. ఎన్నిసార్లు చూసినా తనివి తీరనట్టు మారిపోతుంది. అలాంటి సినిమాల్లో ఖుషి తప్పకుండా ఉంటుంది. పవన్ కల్యాణ్ ఇమేజ్ ని పదిందలు చేసిన సినిమా ఇది. యూత్ లో తన ఫాలోయింగ్ ని వందింతలు పెంచిన సినిమా ఇది. ఈ సినిమా విడుదలై.. ఈనాటికి సరిగ్గా 20 ఏళ్లు.
‘నువ్వు నా నడుముని చూశావ్…’
‘చూళ్లేదు..’
‘చూశావ్..’
‘చూళ్లేదు’…
– అబ్బ. ఏం సీన్ అది. హీరో – హీరోయిన్ల మధ్య – ఇలాంటి విషయంలో గొడవ పెట్టాలని, నడుం కారణంగా ఓ జంటని విడగొట్టాలని దర్శకుడికి ఎందుకు అనిపించిందో..? ఓ రకంగా ఇది సాహసం. కథలో ఫ్లో అంత వరకూ బాగా నడిచింది కాబట్టి సరిపోయింది. లేదంటే.. ‘నడుం గొడవేంట్రా బాబూ’ అని ప్రేక్షకుడు థియేటర్ నుంచి అప్పుడే పలాయనం చిత్తగించేవాడు. హీరో, హీరోయిన్ల మధ్య ‘ఈగో..’ తోసినిమాని నడిపించేయొచ్చని, దాన్ని సూపర్ హిట్ చేయొచ్చని చెప్పిన సినిమా ఇదే కాబోసు. అందుకే యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఇక ఈ నడుం సీన్ అయితే చెప్పక్కర్లెద్దు. ఈ సీన్ పై వచ్చిన పేరడీలు, స్నూఫ్‌లు మరే సీన్‌కీ రాలేదంటే… నమ్మండి. ఇప్పటికీ జబర్దస్త్ లో విరివిగా దీన్ని వాడేస్తున్నారు. పవన్ భూమికకు ప్రేమలేఖ ఇచ్చే సీన్, అలీతో మందు కొట్టే సీన్, `ఫోన్ లో ఎవరు.. గీత` అనే సీన్, ‘నీకు ఎవరు ఇష్టం..’ అంటూ పవన్ – భూమిక వెంట పడుతూ అడిగే సీన్.. ఇలా ప్రతీదీ ఫ్రెష్ నెస్‌కి కేరాఫ్ అడ్రస్స్‌గా నిలిచాయి.
ఇది తమిళ సినిమాకి రీమేక్. అక్కడ విజయ్ చేశాడు. ఇక్కడ పవన్ కల్యాణ్. రెండు పాత్రల్నీ పక్క పక్కన పెట్టి చూడండి. పవన్ చేస్తున్నప్పుడు ఓ ఫ్రెష్ నెస్ కనిపిస్తుంది. విజయ్ ని పూర్తిగా మరిపించేసి, ఆ పాత్రకి మరో పదింతల గ్లామర్ తీసుకొచ్చాడు. ముందే ఖుషి విడుదలైతే.. తప్పకుండా పవన్ ని కాపీ కొట్టాలని విజయ్ కి అనిపించేంతగా పవన్ ఈ పాత్రని ఓన్ చేసుకున్నాడు. పవన్ కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్, మేనరిజం.. అన్నీ సూపర్బ్స్ అంతే. పవన్ కి ఇంత అందంగా మరో సినిమాలో చూళ్లేదని పవన్ ఫ్యాన్సే చెబుతుంటారు.
మణిశర్మ పాటలు ఈ సినిమా స్థాయిని.. మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. పాటని ఈసినిమా కోసం రీమిక్స్ చేశారు. ఆ పాటని సరైన సమయంలో, సరైన చోట, అవసరానికి తగ్గట్టు వాడుకోవడం, ఆ పిక్చరైజేషన్.. ఇవన్నీ రీమిక్స్ చేయడం ఎలాగో ఈతరానికీ చెబుతుంటాయి. ఏ మేరా జహా.. పాట ఓ ప్రయోగం. తెలుగులో ఓ హిందీ పాట వినడం అదే తొలిసారి. ఈ క్రెడిట్ తప్పకుండా పవన్ కే దక్కుతుంది. ‘నాకు ఇలాంటి పాట కావాలి’ అని చెప్పి, ఆ పాటని మణిశర్మతో దగ్గరుండి కంపోజ్ చేయించుకున్నాడు పవన్. రంగోబొతీ, బైబైయే బంగారు రమణమ్మ పాటల్ని పవన్ స్వయంగా ఆలపించాడు. ఇవి జానపద గేయాలు. ఈ సినిమాలో కొన్ని ఫైట్స్ కూడా పవన్ స్వయంగా కంపోజ్ చేశాడు. ఈ సినిమాకి రేణూ దేశాయ్ కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది.
ఈ సినిమా కోసం ముందు అనుకున్న టైటిల్ `చెప్పాలని ఉంది`. అమీషా పటేల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఓ ఫొటో షూట్ కూడా చేశారు. కానీ.. ఆ స్థానంలో భూమిక వచ్చింది. పవన్ – భూమికల కెమిస్ట్రీ ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ గా మారింది. అప్పట్లోనే ఈ సినిమా 20 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.