సంగం డెయిరీని టార్గెట్ చేసుకునే ధూళిపాళ్ల నరేంద్రను ప్రభుత్వం అరెస్ట్ చేయించిందనే దానికి వరుసగా జరుగుతున్న పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. సంగం డెయిరీకి ఉన్న మిల్క్ ప్రొడ్యూసర్స్ అనుమతిని రద్దు చేసింది. .. సంగం డెయిరీ యాజమాన్య హక్కులను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసేసింది. సంగం డెయిరీని గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘానికి బదిలీ చేసినట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. రోజువారీ వ్యవహారాలను చూసే బాధ్యతను తెనాలి సబ్ కలెక్టర్ కు ఇప్పగించింది. ఆయన ఉత్తర్వుల్ని తీసుకుని హుటాహుటిన సంగం డెయిరీకి చేరుకున్నారు. డెయిరీని అధీనంలోకి తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
సంగం డెయిరీ కంపెనీల చట్టం పరిధిలో ఉంది. అయితే ఆ చట్టంలోకి అక్రమంగా మార్చారని .. సంతకాలు ఫోర్జరీ చేశారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. గతంలో ఈ అంశంపై నోటీసులు జారీ చేసింది. అయితే సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్న ధూళిపాళ్ల నరేంద్ర హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకువచ్చుకున్నారు. ఇప్పుడు అదే అంశాలపై మళ్లీ కేసులు పెట్టి రాత్రికి రాత్రి ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయడమే కాకుండా… ఇంకా అక్రమాలు జరిగాయో లేదో నిర్ధారణ కాకుండానే… సంగం డెయిరీని స్వాధీనం చేసుకునేందుకు అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. చైర్మన్, ఎండీలను అరెస్ట్ చేసి… రోజువారీ వ్యవహారాలకు భంగం కలగకూడదంటూ.. ప్రభుత్వం జాయింట్ కలెక్టర్‌ను సంగం డెయిరీకి పంపడం కలకలం రేపుతోంది.
న్యాయవ్యవస్థను కూడా పట్టించుకోకుండా… సంగం డెయిరీని స్వాధీనం చేసుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అన్ని రకాల హద్దులను దాటేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై కోర్టుల్లో విచారణ జరిగే సరికి.. విజయవంతమైన ఆ డెయిరీకి చేయాగలిగినంత నష్టం చేయగలిగితే.. అమూల్‌కు అంత మేర లాభం కలుగుతుందనేది ప్రభుత్వ కుట్ర అని విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.