ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ అంటే పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే వారిలో వైసీపీ అధినేతలు ముందు ఉంటారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి … వేమూరి రాధాకృష్ణను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులపై దాడులు కూడా చేశారు. పత్రికకు.. చానల్‌కు ప్రకటనలు ఇవ్వడంలేదు. ఇక విజయసాయిరెడ్డి అయితే ట్వీట్లలో ఆయన సంస్కారం మరచి విమర్శలు చేస్తూంటారు. అయితే.. ఇప్పుడు ఇద్దరూ… ఓ విషయంలో వేమూరి రాధాకృష్ణకు మద్దతుగా నిలిచారు. కష్టకాలంలో దైర్యంగా ఉండాలని మంచి మాటలు చెప్పారు. వేమూరి రాధాకృష్ణకు సతీవియోగం అయిన విషయం తెలిసిన ముఖ్యమంత్రి జగనమోహన్ రెడ్డి… మధ్యాహ్నం ఆయనకు ఫోన్ చేశారు.
తీరని నష్టమే జరిగినా… తగినంత ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడ్ని కోరుకున్నట్లుగా చెప్పారు. మామూలుగా అయితే జగన్ .. వేమూరి రాధాకృష్ణపై చూపే వ్యక్తిగత ద్వేష స్థాయిని పరిశీలిస్తే..నేరుగా ఫోన్ చేయరు. మీడియా అధిపతి కాబట్టి.. ఓ ట్వీట్ పెట్టేవారేమో. కానీ అనూహ్యంగా ఫోన్ చేసి.. తన సంతాపాన్ని తెలిపారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మ్యానర్స్ లేకుండా ట్వీట్లు చేసే విజయసాయిరెడ్డి అనూహ్యంగా స్పందించారు. ఆయన కూడా.. వేమూరి రాధాకృష్ణ కోసం దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లుగా చెప్పారు.
మంచి మాటలు తన ట్వీట్లలో కనిపించే ప్రయత్నమే చేయరు విజయసాయిరెడ్డి. ముఖ్యంగా ఇతర పార్టీల నేతలు… రాజకీయంగా ప్రత్యర్థులు అనుకునేవారిని వదిలి పెట్టారు. కానీ ఎంతో తీవ్రంగా ద్వేషించే వేమూరి రాధాకృష్ణకు సానుభూతిగా ఆయన ట్వీట్ పెట్టారు. ఈ ఇద్దరి స్పందనలు… నేటి హైలెట్‌గా నిలిచాయి.