అప్పట్లో అంటే సాక్షి పేపర్ పెట్టిన కొత్తలో … రూ.రెండు ధరను నిర్ణయించారు. అది వారి మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకున్నారు. కానీ విచిత్రంగా ఇతర పత్రికలూ రూ. రెండుకే ఇవ్వాలన్న ఓ ఉద్యమం ప్రారంభించారు. ఇతర పత్రికలు పట్టించుకోలేదు సరి కదా.. అప్పనంగా దోచేసిన సొమ్ముతో చేసే వ్యాపారాలు అలాగే చేస్తారని విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు… టీవీ9 కూడా నాటి సాక్షి బాటలోనే వెళ్తోంది. అయితే ఇక్కడ కాస్త రూటు మార్చింది. తన టీవీ చానల్ గురించి కాకుండా.. వ్యాక్సిన్ గురించి అలాంటి ఉద్యమం ప్రారంభించింది. వ్యాక్సిన్ రేటు తగ్గించాల్సిందేనని డిమాండ్ చేస్తూ.. టీవీ9లో ప్రోమోలు వేస్తున్నారు.
వ్యాక్సిన్ రేటు చాలా ఎక్కువగా ఉందన్నది అందరి అభిప్రాయం. అయితే దానికి కారణాలేమిటన్నదానిపై నిపుణులు ఇప్పటికే అనేక రకాల విశ్లేషణలు చేశారు. అందులో మొదటిది… రాజకీయ కారణమే. కోవిషిల్డ్ ను ఇతర దేశాల్లోనూ విక్రయిస్తున్నారు. ఇతర దేశాల్లో ఎక్కడా రూ. ఆరు వందలు ఒక్క డోసు లేదు. రూ. మూడు వందలే ఎక్కువ. అయితే ఇండియాలో మాత్రం ఆ ధరను సీరం ఇనిస్టిట్యూట్ రూ. ఆరు వందలుగా నిర్ణయించింది. కోవాగ్జిన్ ఇప్పటి వరకూ బయట మార్కెట్లకు అమ్మలేదు. కేంద్రానికే రూ. నూట యాభైకు సరఫరా చేస్తోంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి యాభై శాతం కేంద్రానికి ఇచ్చి.. మిగతా యాభై శాతం ఉత్పత్తిని ఇష్టం వచ్చిన వారికి అమ్ముకోవచ్చు. అందుకే రేటు ప్రకటించింది. అది చాలా ఎక్కువగా ఉంది. కొద్ది రోజుల కిందట… వాటర్ బాటిల్ ధరకే వ్యాక్సిన్ అందిస్తామని భారత్ బయోటెక్ ఘనంగా ప్రకటించింది. అలాంటి సంస్థ ఇంకా తక్కువ ధరకు టీకాలను అందుబాటులోకి తెస్తుందని అనుకున్నారు.
టీకా ధరలు ఇంత ఎక్కువగా ఉంటానికి కారణం… ప్రభుత్వాలకు ఇస్తున్న సబ్సిడీని ప్రజల నుంచి ఆ సంస్థలు రాబట్టుకోవడమేనని వ్యాపార వ్యూహాలు తెలిసిన వాళ్లు చెప్పేమాట. కేంద్రానికి రూ. నూటయాభైకి పంపిణీ చేస్తున్నారు. కేంద్రం అవి రాష్ట్రాలకు ఇచితంగా ఇస్తోంది. అయితే ఈ రూ. నూటయాభై కంపెనీలకు గిట్టుబాటు కాదు. అందుకే… ప్రజలకు అమ్మే వ్యాక్సిన్లను.. అత్యధిక ధరకు అమ్ముకోవడానికి ప్రభుత్వం చాన్సిచ్చింది. అందులో సందేహం లేదు. అందుకే… రూ. మూడువందలకు ఇతర దేశాల్లో అమ్మే కోవిషీల్డ్ టీకాలు..రూ.ఆరు వందలకు ఇండియాలో అమ్ముతామంటే కేంద్రం నోరెత్తడం లేదు. ఇక కోవాగ్జిన్ కూడా అంతే. ఆయా కంపెనీల వద్ద ప్రభుత్వం తీసుకుంటున్న దానికి.. ఆయా కంపెనీలు ప్రజల నుంచి వసూలు చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారన్నమాట.
ఈ లెక్కన చూస్తే.. ఉచితంగా ఇచ్చే టీకాల మొత్తాన్ని .. డబ్బులు పెట్టికొనుక్కునే వారి దగ్గర నుంచి కేంద్రం వసూలు చేస్తోంది. ఈ విషయాన్ని టీవీ9 చెప్పడం లేదు. పరిశోధనలు చేసి.. వేల కోట్లు పెట్టుబడి పెట్టి… ప్రజారోగ్యాన్నికాపాడేందుకు అహర్నిశలు శ్రమించిన వారి కష్టాన్ని … రేటు పేరుతో.. కించ పరిచేందుకు మాత్రం.. వెనుకాడటం లేదు. అందుకే…టీవీ9లో ఇలాంటి కథనాలు రాగానే.. సోషల్ మీడియాలో మహా సిమెంట్ రేటును సగానికి తగ్గించాలి… మైహోమ్ ఫ్లాట్స్ రేటును యాభై శాతం డిస్కౌంట్‌కు ఇవ్వాలి అనేకామెంట్లు పెడుతున్నారు.