భారత్లో మీడియా అచేతనమైపోయింది. కరోనా కంటే భయంకరమైన వైరస్ సోకి.. చిక్కిశల్యమైపోయింది. అధికారానికి గులామ్ కొడుతూ.. ప్రజలు చచ్చిపోతున్నా… వారి వైపు నిలబడలేని దారుణమైన దుస్థితికి చేరింది. అంతర్జాతీయ మీడియా … ఇండియా మీడియాపై సెటైర్లు వేస్తున్నా… తుడుచుకుని వెళ్లిపోతున్నారు కానీ ఒక్కరంటే ఒక్కరూ.. నోరు మెదపడం లేదు. నోరెత్తాలనుకుంటున్న వారిపై ఇప్పటికే ఆర్థికంగా సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. వారికి ఆర్థిక బంధనాలేశారు. 90 శాతం మీడియాకు.. కావాల్సినన్ని తాయిలాలిచ్చి.. నోరు మూసేయగా.. మరో పదిశాతం మీడియా వాయిస్ వినిపించకుండా కట్టడి చేశారు. ఫలితంగా ఇప్పుడు…. ప్రజలు చచ్చిపోతున్నా.. ఏ ఒక్క మీడియాకూ పట్టడం లేదు.
దేశంలో ఆరోగ్య దుస్థితిపై మీడియా చెప్పేదెంత..?
కరోనాపై … ప్రభుత్వాలు అడ్డగోలు అబద్దాలు చెబుతున్నాయి. ఆ విషయం సామాన్యుడు కూడా చెబుతాడు. హాస్పిటల్స్ వద్ద పరిస్థితి చూస్తే.. ఇండియాలో వైద్య సౌకర్యాలు సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయో లేవో తెలుస్తుంది. కరోనా సమయంలో ప్రజలు లక్షల్లో కరోనా బారిన పడుతూంటే.. తాత్కాలికంగా అయినా ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకున్నాయో.. వివరించే బాధ్యత మీడియాకు ఉంది. కానీ.. ప్రభుత్వాధినేతలు చేసే ప్రకటనలకే పెద్ద పీట వేసి.. ఆయన మహా వీరుడు.. శూరుడు.. కరోనాపై విజయం సాధించేశారని ప్రకటిస్తాయి..కానీ క్షేత్ర స్థాయిలో ఎంత అమలవుతున్నాయో… ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేయరు. ఢిల్లీ నుంచి గల్లీ ప్రభుత్వాల దాకా అదే జరుగుతోంది. కానీ ఏ మీడియా కూడా వాస్తవాన్ని చెప్పడం లేదు. ఇంకా చెప్పాలంటే.. ప్రజల కష్టాలను పట్టించుకోకుండా.. పాలకుల్ని పొగడటంలో నిమగ్నమయింది.
ప్రజల చావుకొచ్చినా పాలకుల ఇమేజ్ కాపాడటానికే ప్రాధాన్యమా..?
కరోనా చావుల విషయంలోనూ ప్రభుత్వం అబద్దాలే చెబుతోంది. సాధారణంగా ఇండియాలో రోజుకు ఇరవై ఎనిమిది వేల మరణాలు సగటున సంభవిస్తాయి. ఇప్పుడు కోవిడ్ వల్ల రెండున్నరవేలు ఎక్కువ అయ్యాయని కేంద్రం చెబుతోంది. కానీ దేశంలో ఏ స్మశాశనం దగ్గరకు వెళ్లినా పరిస్థితి వేరుగా కనిపిస్తోంది. ఆరని చితిమంటలే కనిపిస్తున్నాయి. గుంటూరులోని బొంగరాల బీడు అనే స్మశాన వాటికలో రోజుకు గతంలో మూడు మృతదేహాలు ఖననం అయ్యేవి. ఇప్పుడు యాభైకి పైగా మృతదేహాలు వస్తున్నాయి. కానీ అవేవీ కరోనా మరణాలు కాదని ప్రభుత్వం వాదిస్తోంది. చెప్పిన ఒకటీ అరా మీడిాపై దండెత్తింది. అంతేమిగతా వారు నోరు మూసుకున్నారు. ఈ పరిస్థితి దేశమంతా ఉంది. ప్రభుత్వం దగ్గర తాయిలాలు తీసుకుని కొన్ని.. భయపడి నోరు మూసుకున్నాయి. జాతీయ మీడియా కూడా అంతే. నరేంద్రమోడీని పల్లెత్తు మాట అనే పరిస్థితి లేదు. దారి తప్పుతున్న పాలకుల్ని గాడిన పెట్టాల్సిన మీడియా ఇప్పుడు పాలకుల భజనలో మునిగి తేలుతోంది. ఆ మీడియాకు… ప్రజల చావులు కనిపించడం లేదు.
ఇక ఇండియన్ మీడియా ప్రజల పక్షం కానే కాదు..!
మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా ప్రజల తరపున నిలబడే మీడియాలో మనుగడ సాగించాయి. విచిత్రంగా అన్ని మీడియాలు మనుగడ సాగించడానికి ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే పరిస్థితి వచ్చింది. అందుకే ఇప్పుడు ఆ దుస్థితి. అంతర్జాతీయంగా అనేక దేశాల్లో భారత్లో కంటే కఠినమైన పరిస్థితులు ఉంటాయి.కానీ అక్కడి మీడియాలు ఇంత దారుణంగా వంగిపోయిన పరిస్థితులు లేవు. కానీ.. ఇండియాలో మాత్రం భిన్నంగా ఉంది. పాలకుడి ఇమేజ్ ఎక్కడ మసకబారుతుందోనని.. ప్రజలు చచ్చిపోతున్నా.. అంతా బాగున్నట్లుగా చెప్పడానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. నిజాన్నిప్రజల ముందు ఉంచడం లేదు. మరింత భయపెట్టలేమని కొంత మంది వింత వాదన వినిపిస్తున్నారు.. నిజం చెబితేనే కదా.. ప్రజలు అప్రమత్తంగా ఉండేది. ఏమైనా.. మీడియా ఇక ప్రజల పక్షం ఉంటుందని అనుకోవడం భ్రమే.